బోథ్, డిసెంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పథకం కింద 17 పాఠశాలలకు రూ.3.50 కోట్లు మంజూరయ్యాయి. ఎంపీపీఎస్, యూపీఎస్, జడ్పీఎస్‌ఎస్‌లో అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ పనులు, పెయింటింగ్, వాటర్ సంపులు, హ్యాండ్ వాష్, కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. బంజారతండా, బోథ్, బోథ్ (బాలుర), ధన్నూర్ (బీ), ఘన్పూర్, బోథ్ (బాలికల), కౌఠ(బీ) (హరిజనవాడ), కౌఠ (బీ), మర్లపెల్లి, సొనాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలతో పాటు జడ్పీ బాలుర బోథ్, జడ్పీ బోథ్ (ఉర్దూ మీడియం), జడ్పీ ధన్నూర్(బీ), జడ్పీ బాలిక బోథ్, జడ్పీ కౌఠ(బీ), జడ్పీ మర్లపెల్లి, జడ్పీహెచ్ఎస్ సొనాల పాఠశాలల్లో అవసరమైన పనుల కోసం నిధులు వచ్చాయి.
కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తి కావస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో చురుగ్గా సాగుతున్నాయి. సరిపడా తరగతి గదులు లేని పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణాలు చేపట్టడంతో బోధన సులువుగా మారుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిచెన్ షెడ్ల నిర్మాణంతో చెట్ల కింద వంట వండే పరిస్థితి తప్పుతుందని మధ్యాహ్న భోజన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్‌వాష్ నిర్మాణంతో బడిలోనే తాగు నీరు, చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్లే తిప్పలు తప్పుతాయని పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు-మన బడి పథకంతో పాఠశాలల రూపు రేఖలు మారిపోనున్నాయి.
పనులు పకడ్బందీగా చేయిస్తున్నాం
పాఠశాలల్లో మన ఊరు-మన బడి పథకం కింద చేపట్టిన పనులు పకడ్బందీగా చేయిస్తున్నాం. ఎప్పటికప్పుడు సందర్శిస్తూ నిర్మాణానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ఎక్కడ కూడా నాసిరకం పనులు జరగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తి చేయించేలా ఎస్ఎంసీ కమిటీలు, కాంట్రాక్టర్లను సమన్వయ పరుచుకొని పనులు చేయిస్తున్నాం.
–టీ సతీశ్‌కుమార్, ఏఈ, సాంఘిక సంక్షేమ శాఖ
సౌకర్యాలు మెరుగవుతున్నాయి…
మన ఊరు-మన బడి పథకంతో పాఠశాలలో సౌకర్యాలు మెరుగవుతున్నాయి. పాఠశాలలో నాలుగు పనుల కోసం రూ.21.89 లక్షలు మంజూరయ్యాయి. తరగతి గదులకు అవసరమైన మరమ్మతులు, డైనింగ్ హాల్, తాగునీటి సౌకర్యం, ప్రహరీ (ఈజీఎస్ నిధులు), హ్యాండ్‌వాష్, తదితర పనులు చేపట్టారు. గతంలో కంటే భిన్నంగా ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది. –కుమ్మరి పోశెట్టి, ప్రధానోపాధ్యాయుడు,ధన్నూర్ (బీ), జడ్పీఎస్ఎస్