కుభీర్, ఆగస్టు 29 : తెలంగాణ సరిహద్దులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర వినాయకుడి ఆలయం గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో జలమయమైంది. పక్కనే ఎల వాగు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారిలోని హై లెవెల్ వంతెనకు ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుంది. ఈ కారణంగా ఆలయంలో చేరిన వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో ఆలయం పరిసరాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి.
ఆలయ ప్రధాన ద్వారంతో పాటు సాంస్కృతిక కళా మండపం, అన్నదాన మండపం నీరు చేరింది. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం వెలిసిన పలు వ్యాపార స్టాళ్లు నీట మునిగాయి. పాలజ్ చుట్టుపక్కల గ్రామాలకు సైతంమధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.