బెల్లంపల్లి, జూన్ 20 : ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను ప్రభు త్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యాప్‌తో రైతులకు యూరియా బస్తాలు లభించకపోగా, వాటి కోసం నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కౌలు రైతులకు ఈ యాప్‌తో సంబంధం లేకపోవడంతో వారికి యూరియా లభించడం లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే యూరియా యాప్‌ను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో దొరకని యూరియా కాంగ్రెస్ పార్టీ దళారుల ఇండ్లలో లభ్యమవుతున్నాయని మండి పడ్డారు. కాసిపేట మండలంలో ఇటీవల ఓ నాయకుడి ఇంట్లో యూరియా బస్తాలు పట్టుబడ్డాయని గుర్తు చేశారు. ఒక్కో బస్తాకు రూ. 100 అదనంగా తీసుకుని విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళారులకు దోచిపెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చిందని, కాంగ్రెస్ సర్కారు ఎకరాకు రూ. 15 వేలు, రెండు పంటలకు కాకుండా మూడు పంటలకు ఇస్తామని గొప్పలకు పోయిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్‌ను అందించగా ప్రస్తుతం ఐదు, ఆరు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండి పడ్డారు. కరోనా కష్టకాలాన్ని కూడా లెక్కచేయకుండా తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కొండంత అండగా నిలవగా, ప్రస్తుతం సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, గిట్టుబాటు ధర కల్పించక రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
నిరసనలో పాల్గొన్న రైతులపై కేసులా?
నెన్నెల మండలం గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడమేమిటని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేసిన ఘటన దేశంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరసనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని, వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుల ఆదేశాల మేరకే రైతులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదా అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు మొబైల్ ఫోన్లు పరిశీలిస్తే ఎవరి ప్రోధ్భలంతో కేసులు నమోదు చేశారో తేటతెల్లమవుతుందని తెలిపారు.
రాబోయేది రైతు పక్షపాత కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం చైర్పర్సన్లను నామినేటెడ్ పద్ధతిలో నియామకం చేయడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికే నామినేటెడ్ పద్ధతిని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది సీఎంలు పాలించారని, ఇలా నియామకం చేయలేదని వివరించారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు సంతోశ్ కుమార్, అరుణ్‌కుమార్, సుందర్రావు, నిరంజన్ పాల్గొన్నారు.