పోలియోతో కాళ్లు చచ్చుబడిన తర్వాత నేను ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్మడం తప్ప వేరే ఏమీ చేయలేనని అనుకున్నాను. కానీ ఆటపై ఇష్టంతో బరువులు ఎత్తడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా లక్ష్యాలు చాలా పెద్దవి. భారత్‌కు మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు.. మనపై మనకు నమ్మకం ఉండి కష్టపడితే ఏదీ ఆపలేదు
-ఝండు కుమార్
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. వైకల్యం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించిన బీహార్ పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ మెగా గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించి సంచలనం సృష్టించాడు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 28 ఏండ్ల ఝండు తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 181 కేజీలు, 190 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి ఓదశలో స్వర్ణంపై ఆశలు రేపాడు. గేమ్స్ రికార్డు కోసం 196 కేజీలు ఎత్తేందుకు చివరి ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో బ్యారెల్.. ర్యాక్‌లో చిక్కుకోవడంతో ఆ బరువు ఎత్తడంలో విఫలయ్యాడు. ఫలితంగా 130.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. నైజీరియాకు చెందిన ఇద్రిస్ రిలువాన్ (132.8 పాయింట్లు) స్వర్ణం గెలవగా, మాథ్యూ హార్డింగ్ (131 పాయింట్లు) రజతం సాధించాడు. మరో భారత లిఫ్టర్ సుధీర్ 114.1 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సచిన్ సివాచ్ శుభారంభం
భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. పురుషుల 60 కేజీల కేటగిరీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అడుగుపెట్టాడు. ఉత్కంఠగా సాగిన తొలి రౌండ్ పోరులో 26 ఏండ్ల సచిన్ 4-1 తేడాతో కెనడా బాక్సర్ కియోమా అహ్మదియేను ఓడించాడు. ఇక, లాన్ బౌల్స్ విమెన్స్ పేర్స్ సెక్షన్-బి విభాగంలో రూపా రాణి-పింకి 2-0తో టై-బ్రేకర్‌లో టోంగా జట్టుపై గెలిచి సెమీఫైనల్ రేసులో నిలిచింది. పురుషుల్లో పుతుల్ సొనోవాల్ తొలి ఓటమి ఎదుర్కున్నాడు.
స్విమ్మర్లు ఫెయిల్
స్విమ్మింగ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. శనివారం పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో దక్షన్ శశికుమార్ (3:58.09 సెకన్లు), ఆర్యన్ నెహ్రా (4:00.26 సెకన్లు) హీట్స్‌లో 15, 16వ స్థానాలతో సరిపెట్టారు. మరోవైపు 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్టార్ స్మిమ్మర్ శ్రీహరి నటరాజ్ 25.29 సెకండ్లతో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఇక, మహిళల వీల్‌చైర్ 3×3 బాస్కెట్‌బాల్ గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్ 1-16తో వేల్స్ చేతిలో చిత్తయింది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ విభాగం పోటీలో తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అరగ్వాల్ చివరి స్థానంతో నిరాశపరిచింది.
అవమానాల నుంచి ఆకాశమంత ఎత్తుకు!
బీహార్‌లోని నలందా జిల్లా హర్నౌట్కు చెందిన ఝండు అసలు పేరు అవినాష్ కుమార్. చిన్నతనంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దాంతో కుటుంబానికి భారం అయ్యాడని, తండ్రి పరువు తీశాడని చుట్టాలు అవమానిస్తూ ‘ఝండు’ (మూర్ఖుడు) అని పిలవడం మొదలుపెట్టారు. చివరికి ఆ పేరే అతని అధికారిక నామంగా స్థిరపడిపోయింది. పదేండ్ల వయసు నుంచే తండ్రి కూరగాయల వ్యాపారంలో చేరిన ఝండు రోజూ తెల్లవారుజామున 4 గంటలకే చేతితో నడిపే ట్రై సైకిల్‌పై 20 కిలోమీటర్లు ప్రయాణించి హోల్‌సేల్ మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి ఫుట్‌పాత్‌పై అమ్మేవాడు. రోజంతా కష్టపడినా కొద్దిపాటి రాబడి మాత్రమే వచ్చేది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబంగ్’ సినిమా చూసి బాడీ బిల్డ్ చేయాలని ఓ చిన్న జిమ్‌లో చేరడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. జిమ్‌లో వ్యాయామం చేస్తూనే నెమ్మదిగా పారా స్పోర్ట్స్ వైపు అడుగులు వేశాడు. మొదట షాట్‌పుట్, జావెలిన్ త్రో ట్రై చేసి చివరకు పవర్‌లిఫ్టింగ్‌పై ఫోకస్ పెట్టాడు. ఇతరుల ఫోన్లలో పవర్‌లిఫ్టింగ్ వీడియోలు చూస్తూ స్వయంగా శిక్షణ పొందాడు.
సరైన పోషకాహారం లేకపోయినా 45 కేజీల బరువున్న రోజుల్లోనే చెస్ట్ ప్రెస్ మెషీన్లో 80-90 కేజీల బరువు ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2019లో జిల్లా స్థాయిలో స్వర్ణం గెలవడం, కోచ్‌లతో పాటు రాష్ట్ర పారా స్పోర్ట్స్ అధికారుల ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2023 జాతీయ చాంపియన్‌షిప్‌కు ముందు డైట్ ఖర్చుల కోసం తాను నడుపుకునే రిక్షాను కూడా అమ్మేశాడు. ఈ క్రమంలో ఝండు సామర్థ్యాన్ని గుర్తించిన జాతీయ కోచ్‌లు గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఎంపిక చేయడం అతని క్రీడా జీవితాన్ని పూర్తిగా మార్చింది. అక్కడ పారాలింపియన్ కోచ్ రాజిందర్ రాహేలు పర్యవేక్షణలో శిక్షణ పొందిన అతను 2025లో 205 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఖేలో ఇండియాలో దానిని 206 కేజీలకు మెరుగుపరుచుకున్నాడు. గతేడాది బీజింగ్ వరల్ కప్, ఆసియా-ఓషియానియా చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇప్పుడు కామన్వెల్త్ పతకం నెగ్గి అవమానించిన ప్రతి నోటికీ తన విజయంతో సమాధానమిచ్చాడు.