కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనున్న ఆ గిరిజన గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకోక చీకట్లోనే మగ్గుతున్నది. గతంలో సోలార్ దీపాలు ఏర్పాటు చేసినా.. మూణ్నాళ్ల ముచ్చటే అ య్యింది. దశాబ్దాలుగా అష్టకష్టాలు పడుతూ బతుకు లీడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అడవి బిడ్డల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
అనుమతించని అటవీశాఖ..
తిర్యాణి మండలం నాయికపుగూడ గ్రామంలో నివసించే వారంతా ఆదివాసీలే.. ఇక్కడ దాదాపు 16 కుటుంబాలు ఉండగా, 80 మంది నివాసముంటున్నారు. కొన్ని దశా బ్దాల క్రితం ఏర్పడిన ఈ గ్రామంలో ఇప్పటి వరకూ కరెం టు సౌకర్యం లేదు. ఇందుకోసం విద్యుత్ శాఖ ప్రయత్నించినప్పటికీ అటవీ శాఖ అధికారులు విద్యు త్లేన్లు, స్తంభాలు వేసేందుకు అనుమతించడం లేదు. ప్ర స్తుత పరిస్థితుల్లో గంటపాటు కరెంటు పోతేనే భరించలేని పరిస్థితి. ఇక ఒక రోజు కరెంటు లేకపోతే సెల్ఫోన్లు మూగబోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తల్లడిల్లిపోతుంటాం.. అలాంటిది ఇక్కడి ఆదివాసులు దశాబ్దాలుగా చీకట్లోనే మగ్గిపోతున్నారు.
పనిచేయని సోలార్ విద్యుత్ దీపాలు
ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నాలుగేళ్ల క్రితం ఈ గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కానీ.. నాలుగు నెలలకే గాలివానల కారణంగా వైర్లు తెగిపోయాయి. సోలార్ ఫలకాలు విరిగిపోయాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు.
వాగు నీరే గతి..
నాయికపుగూడ గ్రామంలో తీవ్రమైన తాగు నీటి సమస్య నెలకొంది. సమీపంలోని వాగులోని నీళ్లు చెత్తాచెదారంతో కలుషితంగా మారాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చెలిమెలు తవ్వుకొని తాగు నీరు తెచ్చుకొని తాగాల్సి వస్తున్నదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు చొరవ తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
అటవీ శాఖ కార్యాలయం ఎదుట మౌన నిరసన
తమ గ్రామానికి విద్యుత్ లేన్ వేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారంటూ నాయికపుగూడ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ముందు మౌనంగా నిరసన చేపట్టారు. నిత్యం చీకట్లో క్రూర జంతువుల మధ్య భయంభయంగా గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.