సిర్పూర్(యూ), నవంబర్ 27: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను వారం రోజులుగా చలి గజ గజ వణికిస్తున్నది. బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ (యూ) మండలంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతున్నది. బుధవారం 7.9 డిగ్రీలకు పడిపోవడంతో పాటు చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా దుప్పట్లు కప్పుకొని పనులకు వెళ్లే పరిస్థితి నెలకొన్నది. మారుమూల గిరి పల్లెల్లో సాయంత్రం 5 గంటలకే వాకిళ్లలో నెగడి వద్ద మంట కాగుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడి పోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.