ఆదిలాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల బాధలు తీరడం లేదు. పంటను విక్రయించేందుకు రోజుల తరబడి మార్కెట్‌యార్డుల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వానకాలం సీజన్ కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా రైతులు మార్కెట్‌యార్డుల్లోని పంటల వద్దే కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జొన్నల కొనుగోళ్లలో ఇలాగే జాప్యమైతే వానకాలం పంటలు సాగు ఆలస్యమవుతుందని రైతులు అంటున్నారు.
తాంసి మార్కెట్‌యార్డులో రైతులు జొన్నలను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చి తొమ్మిది రోజులైనా విక్రయించలేని పరిస్థితి. తాంసి, తలమడుగు మండలాలకు చెందిన రైతులు జొన్నలను పెద్ద మొత్తంలో ఇక్కడికి తీసుకువస్తున్నారు. కాంటా చేసిన పంటను గోదాముల్లోకి తరలించడంలో జా ప్యమవుతున్నది. లారీలతో పాటు హమాలీల కొరత కారణంగా పంట రవాణా జరగడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి జొన్నల కుప్పల వద్ద రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. మార్కెట్ యార్డులో నిల్వలు నిండిపోవడంతో తాంసి నుంచి సుంకిడి వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా రైతులు పోసిన జొన్న కుప్పలు కనిపిస్తున్నాయి.
తలమడుగు మండలం కజ్జర్లలో పంట కొ నుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామంలో గోదాంను ఏర్పాటు చేసుకుని లారీ ట్రాన్స్పోర్టులతో స్వయంగా మాట్లాడుకుని జొన్నలను తరలిస్తున్నారు. లారీలకు టన్నుకు రూ.500 చొప్పున చెల్లిస్తుండగా ఈ డబ్బులను కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు పంట డబ్బులతో పాటు ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. రైతులు స్వయంగా లారీలను మాట్లాడుకోవడంతో పంట రవాణా వేగంగా జరుగుతుంది. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో బ యట కొనుగోళ్లతో ఆదిలాబాద్ మార్కెట్‌యా ర్డు జొన్న సంచులతో నిండిపోవడంతో గేటు బయట రోడ్డుపైనే పంట కొనుగోళ్లు జరుగుతున్నాయి. లారీలు, హమాలీల కొరత కారణంగా జొన్నల రవాణాలో తీవ్ర జాప్యమవుతున్నది. మార్కెట్‌యార్డులో పంట నిల్వ లు పేరుకుపోగా రైతులు ఎడ్ల మార్కెట్లో జొన్న భారీగా తీసుకువచ్చి పోస్తున్నారు. జి ల్లాలో వర్షాలు పడుతుండడంతో కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు.