మందమర్రి, మే 5 : మంచిర్యాల జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మందమర్రి పట్టణంలో కేకే 5 ఫిల్టర్ బెడ్ చైతన్య కాలనీలో భారీ వృక్షం విరిగి ఇంటిపై పడడంతో ఇంటి ముందున్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. కార్మెల్ పాఠశాల ఎదురుగా ఉన్న క్వార్టర్‌పై చెట్టు కొమ్మలు విరిగి పడడంతో ప్రహరీ కూలిపోయింది. ఆ సమయంలో ఇండ్లలో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. కేకే 5 గని సమీపంలో చెట్లు విరిగి పడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సింగరేణి విద్యుత్ శాఖ సిబ్బంది హుటాహుటిన వచ్చిన మరమ్మతులు చేశారు. ఈదురు గాలులకు పలుచోట్ల ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్‌లు రోడ్లపై ఎగిరిపడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
జైపూర్, మే 5: జైనూర్ మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షంతో పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వెంకట్రావుపల్లె శివారు రైతు సిద్ధం సత్తయ్య మామిడితోటలో స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునఃరుద్ధరించాలని రైతులు కోరారు.
నెన్నెల, మే 5: ఇటీవల అకాల వర్షాలకు నెన్నెల మండల కేంద్రంతో పాటు ఆవుడం, గంగారం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, ఇండ్లను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం పరిశీలించారు. ఆవుడం గ్రామంలో గాలి వానకు విరిగిన మామిడి చెట్లను పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. గంగారం గ్రామంలో నేల కూలిన ఇండ్లను, తడిసిన ధాన్యం, నేల వాలిన వరి పొలాలను పరిశీలించారు. నెన్నెలలోని కొత్తగూడెంలో కూలిన ఇండ్లతో పాటు గాయాల పాలైన బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు పంట నష్టం సర్వే చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కూలిన ఇండ్లకు అర్హులైన వారికిఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేలా చూస్తానన్నారు. ఆయన వెంట ఆర్డీవో హరికృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, మే 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఆసిఫాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఒకసారిగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై వెళ్తున్న ద్విచక్రవాహనదదారులు ఇబ్బంది పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.