నిర్మల్ అర్బన్ / ఆదిలాబాద్ రూరల్ సెప్టెంబర్ 14 : విద్యాశాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఎప్పటికప్పడు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ విద్యార్థుల ఇబ్బందులను దూరం చేస్తున్నది. ప్రతీ ఏటా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధ్యాయ కొలువులు దక్కించుకునేందుకు కావాల్సిన అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నది. 2023-24 సంవత్సరంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం, పేపర్ -1, మధ్యాహ్నం పేపర్- 2 పరీక్షకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్ష సామగ్రి జిల్లాకు చేరుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టెట్‌ను పకడ్బందీగా నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పేపర్ -1 పరీక్షకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 7611 మంది పరీక్ష రాయనున్నారు. పేపర్ -2 కు 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 4586 మంది హాజరు కానున్నారు. అత్యధికంగా మంచిర్యాల్ జిల్లాలో పేపర్-1,2 కు అభ్యర్థులు హాజరుకానున్నారు. మంచిర్యాలలో 33 పరీక్షా కేంద్రాల్లో 7716 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్- 2కు 25 పరీక్షా కేంద్రాల్లో 5745 అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేపర్-1కు 119 పరీక్షా కేంద్రాల్లో 28,015, మంది అభ్యర్థులు, పేపర్ -2కు 70 పరీక్షా కేంద్రాల్లో 15,545 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లకు దివ్య గార్డెన్లో శిక్షణ ఇచ్చాం. కలెక్టర్ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిశోర్ ఆదేశాల మేరకు అభ్యర్థులకు అన్ని సౌకర్యాలున్న అనువైన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
– నిర్మల్ డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాలో టెట్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఇన్విజిటర్లకు ప్రత్యేక శిక్షణ అందించాం. టెట్ పారద్శకంగా జరిగేలా చూస్తాం. అభ్యర్థులు కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఆందోళన చెందకుండా పరీక్ష రాయొచ్చు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.
– ఆదిలాబాద్ డీఈవో ప్రణీత