అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగానే దళితబంధు, బీసీ బంధు తీసుకురాగా, తాజాగా మైనార్టీలకు రూ. లక్ష సాయం అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 69 రకాల యూనిట్లకు 19,022 దరఖాస్తులు రాగా, మొదటి విడుతలో 666 మందిని ఎంపిక చేసింది. ప్రస్తుతం చెక్కుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా, ముస్లిం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఆర్థికంగా చేయూతనందించి.. భవిష్యత్‌కు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారు సల్లంగా ఉండాలంటూ దీవెనలందిస్తున్నది.
– మంచిర్యాల, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమ ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఇందులో భాగంగానే కుల వృత్తులకు చేయూతనందించి ప్రోత్సహిస్తున్నది. గొర్రె పిల్లలు, చేప పిల్లలు పంపిణీ, దళితబంధు, బీసీబంధు ఇలా ఏది చేసినా.. ఆయా కులాలు, వర్గాలు బాగుపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే దళితబంధు తరహాలో బీసీ కులవృత్తులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో రూ.లక్ష సాయం చేసే బీసీ బంధు కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. ఈ మధ్యే నియోజకవర్గానికి 300 మంది చొప్పున ఎంపిక చేసి చెక్కులు అందించింది. అదే తరహాలో తెలంగాణలోని మైనార్టీలను ఆదుకోవడం కోసం రూ.లక్ష సాయం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులకు చెక్కుల పంపిణీ కొనసాగుతున్నది.
మంచిర్యాల జిల్లాలో రూ.లక్ష సాయం కోసం ముస్లిం మైనార్టీల నుంచి 2,709 దరఖా స్తులు రాగా, తొలి విడుతలో 100 మందిని, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 3,000 దరఖాస్తులు రాగా, 112 మందిని, ఆదిలాబాద్‌లో 6,228 దరఖాస్తులు రాగా, 222 మందిని, నిర్మల్‌లో 7,085 దరఖాస్తులు రాగా, 232 మందిని అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 69 రకాల యూనిట్ల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 19,022 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రామాల్లో రూ.1.50వేల లోపు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో రూ.2 లక్షలలోపు వార్షికాదాయం కలిగి ఉండి, ఏదైనా వ్యాపారం కోసం దరఖాస్తు చేసుకున్న వారినే అర్హులుగా ఎంపిక చేశారు. మండలాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు అర్హులను ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా కమిటీకి అందజేశారు. తొలి విడుతలో ప్రతిచోటా 62 శాతం పురుషులు, 33 శాతం మహిళలు, ఐదు శాతం దివ్యాంగులకు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 90, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 32, ఇచ్చోడలో 28, ఇంద్రవెల్లి, నార్నూర్‌లో 8 మంది చొప్పున, బజార్హత్నూర్, బేల, బోథ్, గుడిహత్నూర్, తాంసిలో ఆరుగురు చొప్పున, మావల, నేరడిగొండ, తలమడుగులో 4 చొప్పున, ఉట్నూర్‌లో 14 మందికి ఈ సాయం అందనున్నది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో 100, ముథోల్ నియోజకవర్గానికి 113, ఖానాపూర్ నియోజకవర్గానికి 19 మంది ఎంపికయ్యారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలో 39, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 27 మంది చొప్పున, ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలంలో ఏడుగురికి లబ్ధిచేకూరనున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 56 మందికి సాయం అందనున్నది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయమందించి అండగా నిలువడంపై ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సర్వమత, సర్వకుల సమానత్వం పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.లక్ష సాయం అందుకున్న ముస్లిం సోదరులు తమ అభిప్రాయాలు ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ బంధు పథకం ద్వారా పేదలను ఆదుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. లక్షతో 2017 మాడల్ సెకండ్ హ్యాండ్ ఆల్ఫా ఆటో కొనుక్కున్న. కొంత రిపేర్ ఉంటే చేయించిన. ప్రతి రోజూ ఆటో నడిపి రూ. ఐదు వందల దాకా సంపాదిస్తున్న. భార్యా పిల్లలతో పాటు అమ్మ సఫీయా, నాన్న సలీం ఖాన్‌ను పోషించుకుంటున్న. మా కుటుంబానికి భరోసానిచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంట. – సల్మాన్ ఖాన్, బెజ్జూర్
ఇంద్రవెల్లి, ఆగస్టు 25 : నా పేరు షేక్ అన్సార్. మాది ఇంద్రవెల్లి. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష సాయం చేసింది. గా డబ్బులతో ఎలక్ట్రిషియన్ వర్క్‌షాపు పెట్టుకున్న. ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉపాధి పొందుతున్న. కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఇది వరకున్న సర్కారోళ్లు మైనార్టీలకు చేసిందేమీ లేదు. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మైనార్టీలకు అనేక మంచి పనులు చేస్తున్నరు. ఇసొంటి సీఎం ఉన్నంత కాలం ప్రజలకు
మేలు జరుగుతది.