లక్ష్మణచాంద, జనవరి 9 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా వరినాట్లు వేస్తున్నారు. పంటల సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తుండడం, పెట్టుబడి సహాయాన్ని సైతం వరినాట్లకు ముందే వరి ఖాతాల్లో జమచేయడంతో ముమ్మరంగా పను లు కొనసాగిస్తున్నారు. గతంలో కేవలం వర్షాకాలం మాత్రమే వరి సాగుచేసి వేసవిలో ఆరుతడి పంటలు పండించేవారు. సేద్యానికి అవసరమైన నీరులేక, సమయానికి కరెంట్ రాక రైతు లు నానా తంటాలు పడేవారు. ఈ క్రమంలో ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతోపాటు సాగుకు అవసరమైన నీటిని సరస్వతీ కాలువద్వారా అందిస్తున్నది. దీంతో వర్షాకాలానికి తగ్గకుండా వరిసాగు చేస్తున్నారు. మండలంలోని తిర్పెల్లి వాగుపై వడ్యాల్, చామన్‌పెల్లి, తిర్పెల్లి శివారులో ప్రభుత్వం చెక్‌డ్యాంలను ఏర్పాటు చేసింది. దీంతో వాగు పరిసర ప్రాంతాల్లో వాగునీటి ద్వారా వరిసాగు చేస్తున్నారు.
వర్షాకాలంలో మండలంలో 9,600 ఎకరాల్లో వరి సాగైంది. దానికి తగ్గకుండా ఈ సారి సైతం వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. మండలంలో ఇప్పటివరకు సుమారు 1200 ఎకరాల్లో వరినాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో 80 శాతానికి పైగా వరినాట్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. జనవరి చివరి వారం లోపు మండలం మొత్తం వరినాట్లు పూర్తకానున్నట్లు మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అధికారులు ముందు జాగ్రత్తతో సరస్వతీ కాలువద్వారా చెరువులన్నీ నింపారు. దీంతో ప్రస్తుతం తటాకాలన్నింటిలో యాసంగికి సరిపడా నీరు అందుబాటులో ఉంది. ప్రభుత్వం వారబంది పద్ధతి ద్వారా సరస్వతీ కాలువ నీటిని వదులుతుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు చెరువుల్లోకి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో వేసవి కాలం వచ్చినా మండలంలోని చెరువులు నీటి తో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడక పూర్వం వేసవి కాలానికి ముందే చెరువులన్నీ ఎండిపోయేవి. పశుపక్ష్యాదులకు తాగునీటికి ఇక్కట్లు ఏర్పడేవి. బీఆర్ఎస్ సర్కా ర్ ముందుచూపుతో వేసవిలోనూ చెరువులు నిండా నీటితో తొణికిసలాడుతుండగా, రైతులు భరోసాగా వరిసాగు చేస్తున్నారు.
బోరు బావుల వద్ద వరినాట్లు వేసే రైతులు సైతం యాసంగిలోనూ వరినాట్లు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక పూర్వం మండలంలోని లక్ష్మణచాంద, పీచర, వడ్యాల్ గ్రామాల్లో మాత్రమే విద్యుత్ సబ్స్టేషన్లు ఉండే వి. దాంతో ఓవర్‌లోడ్‌తో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలోని పార్పెల్లి, మల్లాపూర్, చింతల్‌చాంద, నర్సాపూర్(డబ్ల్యూ), రాచాపూర్ గ్రామాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలంలోని ఏ గ్రామంలోనూ ఓవర్‌లోడ్ సమస్య లేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో రైతులు బోరుబావుల కింద వరిసాగు క్రమంగా పెంచుతున్నారు.
నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. 10 ఎకరాల భూమిలో రెండు బోరుబావులున్నాయి. కౌలు తీసుకున్న భూమికి గోదావరి నీరు అందుతుంది. దీంతో గోదావరిలో విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేసి మొత్తం 25 ఎకరాల్లోనూ వరిసాగు చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో వరిసాగుకు ఇబ్బంది లేదు. ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా నా ఖాతాలో రూ.50 వేల ఆర్థికసాయం అందించింది. అవి ఎరువులు, కూలీలు, ట్రాక్టర్లకు ఉపయోగమయ్యాయి. రైతు బంధు పథకం లేనప్పుడు నాట్ల సమయంలో అప్పుచేసేటోణ్ని. ఇప్పుడు ఆ బాధ తప్పింది.
– కొమ్మోజీ రమణ, చామన్‌పెల్లి