సారంగాపూర్, మార్చి2 : ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనానికి పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సాధారణ బియ్యం మాదిరిగా ఉండే ఈ పోర్టిఫైడ్ రైస్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ-12 నిర్ణీత మోతాదులో ఉంటాయి. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే గర్భిణుల్లో రక్తహీనత, చిన్నారుల్లో ఎదుగుదల లోపం, వయసుకు తగిన బరువు లేకపోవడం లాంటి లాంటి సమస్యలను అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో 412 రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో 412 రేషన్ దుకాణాలకు గాను 2,08,685 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 6,43,420 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డుల్లో అంత్యోదయ (ఏఎఫ్ఎస్సీ) కార్డులు 12,589, ఆహారభద్రత (ఎఫ్ఎస్సీ)కార్డులు 1,96,0,63 ఉన్నాయి. అన్నపూర్ణ (ఏఏపీ) కార్డులు 33 ఉన్నాయి. ఈ కార్డులకు ప్రతి నెలా 3465 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర సర్కారు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా అందజేస్తున్నది. చిన్నారులు, విద్యార్థినుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనానికి, అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే పోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
పోర్టిఫైడ్ బియ్యంలో పోషకాలు ఉంటాయి. ఆహార పదార్థాల్లో పోషక లోపాన్ని గుర్తించిన కృత్రిమ పద్ధతి ద్వారా పోషకాలను కలిపే ప్రక్రియనే పోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ-12 నిర్ణీత మోతాదులో ఉంటాయి. సాధారణ బియ్యంగా మార్చే క్రమం లో ఎక్కువగా పాలిష్ చేయడంతో తవుడు, నూక రూపంలో పోషకాలు వెళ్లిపోతాయి. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందవు. ఈ నేపథ్యంలో గర్భిణుల్లో రక్తహీనత, చిన్న పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, వయసుకు తగిన బరువు పెరగపోవడం లాంటివి సమస్యలు అత్యధికంగా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ బీ-12 పోషకాల మిశ్ర మం కలిగిన కృత్రిమ బియ్యం తయారు చేస్తారు. 50 కిలోల సాధారణ బియ్యం బస్తాలో 500 గ్రా ముల పోర్టిఫైడ్ మిశ్రమ బియ్యాన్ని కలిపి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బియ్యంలో కావాల్సిన పోషకాలు ఉండడంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈ బియ్యం ఉపయోగించడం వల్ల రక్తహీనత నుంచి రక్షణ లభించడం, శరీరంలో అలసట తగ్గడం, చురుకుదనం పెరగడం, నెలలు నిండకుండా ప్రసవించడం, బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.
జిల్లాలోని రేషన్ దుకాణాలకు ఏప్రిల్ నుంచి పోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న పథకానికి పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ బియ్యం పేదలకు పంపిణీ చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.
శ్రీకళ, పౌరసఫరాల శాఖ డీఎం, నిర్మల్ జిల్లా