ఖానాపూర్ రూరల్, నవంబర్ 27 : వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. అధికంగా కురిసిన వర్షపాతంతో వరద తాకిడికి కొన్ని ప్రాంతాల్లో కాలువలు తెగి గండ్లు పడ్డాయి. దీంతో దిగువ ప్రాంత రైతులకు నీరు అందకుండాపోయింది. పంటలు సైతం పండలేదు. ఖానాపూర్, కడెం మండలాల జీవనధారమైన సదర్మాట్ కాలువలకు ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో వానకాలం పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఖానాపూర్ మండలంలోని ఎల్లాపూర్‌లో సదర్మాట్ కాలువకు పెద్ద గండి పడడంతో కడెం మండలంలోని సదర్మాట్ ఆయకట్టు రైతులకు నీరందకుండా పోయింది. ఈ రెండు మండలాల్లో పంటలు పండుతాయో లేవోనని రైతన్నలు అయోయమంలో పడ్డారు. దీంతో ప్రభుత్వం సదర్మాట్ కాలువ మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసింది. రూ.10 లక్షలతో తక్కువ సమయంలోనే పనులను పూర్తి చేసి వానకాలం పంటలకు సదర్మాట్ ద్వారా ఖానాపూర్‌లో 5500 ఎకరాలకు నీటిని అందించారు.
కడెం ఆయకట్టు రైతులకు నీరందించలేకపోయారు. యాసంగికి కడెం రైతులకు ఎలాగైనా నీరందిస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఖానాపూర్ మండలంలోని ఎల్లాపూర్ వద్ద సదర్మాట్ కాలువకు పడిన గండి మరమ్మతులకు రూ.15 లక్షలు మంజూరు చేశారు. పనులను సైతం రేపోమాపో ప్రారంభించనున్నారు. దీంతో దిగువ ప్రాంతం కడెం మండల రైతులకు యాసంగి పంటలకు నీటిని అందించనున్నారు. మొత్తం 13 వేల ఎకరాలకు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
యాసంగికి నీరందించడం చాలా సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు లేకుండా పోయాయి. అధిక వర్షపాతంతో వరద తాకిడితో గండ్లు పడిన ప్రదేశాలను పూడ్చి వానకాలం రైతులను ఆదుకున్నారు. యాసంగి పంటకు సైతం ఎల్లాపూర్‌లో పడిన గండిని పూడ్చి నీరందిస్తామనడంతో కడెం ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్, కడెం మండలాల రైతులకు యాసంగి పంటలకు నీరందుతుండడం ఆనందంగా ఉంది.
– సల్ల మల్లేశ్, రైతు, దిలావర్పూర్
వర్షాకాలంలో సదర్మాట్ కాలువకు గండ్లు పడ్డాయి. కడెం మండల ఆయకట్టు రైతాంగానికి నీటిని అందించలేకపోయాం. యాసంగి పంటకు కచ్చితంగా నీరందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. పనులు వేగంగా చేపట్టి ఖానాపూర్, కడెం మండలాల సదర్మాట్ ఆయకట్టు రైతులకు నీరందిస్తాం. ఈ నెల 26 వరకు నీటిని అందించి పనుల కోసం కాలువను నిలిపివేస్తాం. రైతుల యాసంగి పంటకు నీరందేలా వేగంగా పనులు చేపడుతాం. రైతులు పంటలు వేసుకునేందుకు సన్నద్ధం కావాలి. ప్రస్తుతం కాలువకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం.
– సురేందర్, డీఈ, నీటి పారుదల శాఖ