ఆదిలాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రైతులు పత్తి విత్తనాలు, మూడో వారంలో సోయా విత్తనాలు, తర్వాత కంది పంటలు వేస్తారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉందని, వర్షా లు తక్కువగా పడుతాయని వాతావారణ శాఖ అధికారుల సూచనల నేపథ్యంలో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఏటా జూన్ మొదటి వారంలో కురిసే వర్షాలు ఈసారి జాడ లేకుండా పోయాయి. భూములు సిద్ధం చేసిన రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మూడు వారాల తర్వాత ఆలస్యంగా వానలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి.
ఊపందుకున్న వ్యవసాయ పనులు
ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 20 వరకు 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగు రోజులుగా పడుతున్న వానలతో వాతావరణం చల్లబడింది. బుధవారం జిల్లాలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వానకాలం సాగు ఇప్పటికే ఆలస్యం కాగా వర్షాలతో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు పత్తి, సోయా విత్తనాలను వేయడంలో బిజీగా ఉన్నారు. జిల్లాలో ఈ సీజన్లో 4.32 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, 72 వేల ఎకరాల్లో సోయా సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో మొదటిసారి వేసిన పత్తి విత్తనాలు వర్షాల పడకపోవడంతో మొలకెత్తకపోగా రెండోసారి విత్తనాలు వేస్తున్నారు. రైతులు సాగుపై ఆశలు పెట్టుకున్న ఎన్నినో ప్రభావం ఏ మేరకు ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మొక్కలకు అవసరమైన సమయంలో వానలు పడకపోతే దిగుబడులపై ప్రభావం పడుతుందని అంటున్నారు. గతేడాది అధిక వర్షాల కారణంగా రైతులు చేతికొచ్చిన పంటలు నష్టపోగా, ఈ ఏడాది ఎల్నినో అన్నదాతల్లో ఆందోళనకు గురి చేస్తున్నది.
