కౌటాల, మార్చి 28 : కేసీఆర్ సర్కారులో అత్యుత్తమ సేవలందించి దేశస్థాయిలో అవార్డులు అందుకున్న కౌటాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రస్తుతం వైద్యం అందించలేని దుస్థితికి చేరింది. కౌటాలతో పాటు బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ పీహెచ్సీ.. ప్రభుత్వ పట్టింపులేని తనంతో ప్రాధాన్యం కోల్పోయింది. ఈ దవాఖానలో పనిచేసిన రెగ్యులర్ వైద్యాధికారులు కొన్ని రోజుల క్రితం బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. గతేడాది కాంట్రాక్టు పద్ధతిన రిటైర్ట్ వైద్యాధికారి సుంకన్నను నియమించారు. ఆయన కాంట్రాక్ట్ కాలం మార్చి ఒకటితో ముగియగా, విధులకు రావడం లేదు.
ఇటీవల కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన మరో యునాని వైద్యాధికారిని తస్లీమా వారంలో మూడు రోజులు వచ్చి వెళ్తున్నారు. రెగ్యులర్ వైద్యాధికారి లేకపోవడంతో స్టాఫ్ నర్సులే వైద్యం అందిస్తున్నారు. గతంలో ఆయుష్మాన్ భారత్లో ఉత్తమ సేవలు అందించి.. అవార్డులు పొందిన ఈ దవాఖానలో వైద్యం అందని ద్రాక్షగా మారిందని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యాధికారిని నియమించాలని ఈ ప్రాంత ప్రజలుకోరుతున్నారు.