సోన్, జూలై 3 : మార్కెట్లో కూరగాయల ధర లు భగ్గుమంటున్నాయి. ఓవైపు వాతావరణం చల్లబడినా.. కూరగాయల ధరలు మాత్రం రోజురోజుకూ పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందకుండాపోతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర విన్నా కొంటే కాదు ధర వింటేనే దడ పుడుతోంది. మార్కెట్లో ఇప్పటికే టమాటలు రూ. వందకు చేరుకోగా, మిర్చి రూ. 120 దాటేసింది. కొత్తిమీర కిలో రూ.200కు పైగానే.. ఇలా ఏ రకం కూరగాయలు కొనాలన్నా మార్కెట్లోకి వెళ్లినవారి కి ధరలు దడ పుట్టించడంతో కిలో కూరగాయలు కొనాలనుకునే వారు అరకిలోకే సరిపెట్టుకోవాల్సి న పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు.
నిర్మల్ మార్కెట్లో ఒక్కసారి కూరగాయల ధరలను పరిశీలిస్తే వారం రోజుల్లోనే వందశాతం పెరగడం వల్ల అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా చూపెడుతున్నది. దీనికితోడు మటన్, చికెన్ ధరలు కూడా తామేమీ తక్కువ కాదని చికెన్ ధర రూ. 300కు చేరుకోగా మటన్ కిలో రూ. 700కు చేరుకుంది.
వర్షాభావ పరిస్థితులే కారణం..
మూడు నెలల క్రితం కురిసిన అకాల వర్షాల వల్ల కూరగాయల పంటలు దెబ్బతినడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిర్మల్ మార్కెట్‌కు నిత్యం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి, మహారాష్ట్ర, నాగ్‌పూర్, భోకర్, నాందేడ్, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. మూడు నెలల క్రితం కురిసిన అకాల వర్షాల వల్ల కూరగాయల పంటలు దెబ్బతినడంతో దిగుమతి తగ్గిందని అక్కడి రైతులు పేర్కొంటున్నారు. కొద్దిపాటి పంటకు డిమాండ్ ఏర్పడడం, రవాణా చార్జీలు కూడా భారం కావడంతో ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడుతున్నదని అంటున్నారు. ప్రతిరోజు డీసీఎంల ద్వారా అక్కడి నుంచి కూరగాయలు నిర్మల్‌కు రాగానే ఇక్కడి వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. వారం క్రితం 25 కిలోల పెట్టె టమాట ధర రూ. 1200 ఉండగా, ప్రస్తుతం రూ. 2200కు చేరుకుంది.
పచ్చిమిర్చి రూ. 1500 నుంచి రూ. 3వేలకు పెరిగింది. కొత్తిమీర మార్కెట్లో రూ. 200 పలుకుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో టమాటో కిలో రూ. 100, మిర్చి రూ. 120, వంకాయ రూ.50, బెండకాయ 60, పువ్వుగోపి రూ. 80, ఆకుగోపి రూ. 60, క్యారెట్ రూ. 120, చిక్కుడు, కాకర రూ. 100 చొప్పున, బీట్రూట్ రూ. 150 ధర పలుకుతుండగా ఆకుకూరగాయల్లో పాలకూర రూ. 60, మెంతికూర రూ. 80 ధర పలుకుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. వారం క్రితం ధరలతో పోల్చితే ఈ ధరలన్నీ రెట్టింపు అయ్యాయి. హోల్సెల్లోనే ఈ ధరలు ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్‌గా అమ్ముకునే కూరగాయల వ్యాపారులకు మరో అదనంగా రూ.10-20 ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. ఈ ప్రభావం మరో 15రోజుల వరకు ఈ ప్రభావం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిర్మల్‌కు గతంలో కూరగాయల వాహనాలు ప్రతిరోజు 5-6 రాగా ఇప్పుడు మూడు వాహనాలే వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.