నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లు సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. భారీగా జనం తరలిరావడం, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచింపజేసేలా ఉండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రైతుబంధు, కరెంటు, పింఛన్లు ఆగిపోతాయని తమ ప్రసంగంలో పేర్కొనడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఊళ్లకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పాలన, ఇంతకు ముందు ఇతర పార్టీల పాలనపై చర్చ పెట్టాలని సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. గులాబీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ఉధృతం చేశారు. భారీ ఎత్తున ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇగ, సభకు వచ్చిన జనతరంగాన్ని చూసి ప్రతిపక్ష నాయకుల్లో వణుకు మొదలైంది. గులాబీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారనే తేలిపోవడంతో డిపాజిట్ వస్తోందా? లేదా? అనే సందిగ్ధంలో పడ్డారు.
– నిర్మల్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ)
నిర్మల్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలు సూపర్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. సీఎం పాల్గొన్న ‘ప్రజా ఆశీర్వాద సభ’లకు భారీగా జనం తరలిరావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించడంతో ఊరూరా కారు దూకుడు పెరిగిందని గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సభల తర్వాత కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉధృతం కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో కలవరం కనిపిస్తోంది.
నిర్మల్‌లో జరిగిన సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ వివరిస్తూనే.. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించడంతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. నిర్మల్ జిల్లా ఏర్పాటుతోపాటు, మెడికల్ కాలేజీ సాధించడంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృషి ఎంతో ఉన్నదని సీఎం కేసీఆర్ నిర్మల్ సభలో ప్రస్తావించి ప్రజలను ఆలోచింపజేశారు. జేఎన్టీయూకూ అనుబంధంగా నిర్మల్‌లో ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.. యువతను బీఆర్ఎస్ వైపు మళ్లేలా చేసిందంటున్నారు. అల్లోలను గెలిపిస్తే నిర్మల్ మున్సిపాలిటీతోపాటు, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని సీఎం స్పష్టం చేయడంతో అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
భైంసాలో జరిగిన సభలో తరచుగా మత ఘర్షణలను ప్రస్తావిస్తూ కులాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి కావాలా? లేక రెండు రోజులకోసారి జరిగే లేనిపోని గొడవలు, రక్తపాతాలు కావాలా.. అంటూ సీఎం ప్రశ్నించడం ముథోల్ నియోజకవర్గ ప్రజలను ఆలోచింపజేసింది. అలాగే ఇక్కడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసల సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు, తాగునీటి సమస్య లేకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. దగాకోరు మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకులను విశ్వసిస్తే అభివృద్ధిలో అట్టడుగుకు వెళ్తామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆయా సభల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.
పొరపాటున కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రైతుబంధు, కరెంటు, పింఛన్లు ఆగిపోతాయని ముఖ్యమంత్రి తన ప్రసంగాల్లో చెప్పడంతో అన్ని వర్గాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు సీఎం కేసీఆర్ పర్యటనలు సూపర్ సక్సెస్ కావడంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముథోల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి చేరిక బీఆర్ఎస్లో జోష్ నింపింది. మొత్తానికి రెండు రోజుల్లో రెండు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్లో పండుగ వాతావరణం నెలకొన్నది.