ఈ సీసీ రోడ్డు లింగాపూర్ మండలంలోని పీహెచ్సీ సమీపంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసి నాలుగు రోజులైనా కాలేదు..అప్పుడే కంకర తేలి పగుళ్లు వస్తున్నది. ఏళ్ల తరబడి ఉపయోగపడాల్సిన రోడ్లను కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతో నాలుగు రోజులకే పగుళ్లు తేలుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/లింగాపూర్, ఏప్రిల్ 2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో నాణ్యతను పట్టించుకునే వారే కరువయ్యారు. ఓ వైపు రోడ్లు వేస్తుండగానే మరో వైపు పగుళ్లు తేలుతున్నాయి. పనుల్లో నాణ్యతపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రూ.60 కోట్లతో 11 వందల వరకు రోడ్లు ఒకే సారి మంజూరు కావడం, నెల వ్యవధిలోనే వీటిని పూర్తిచేయాల్సి ఉండడంతో పనులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతను పట్టించుకునే వారు లేక రోడ్లకు క్యూరింగ్ చేయకపోవడంతో వేసిన వారం రోజుల్లోనే కంకర తేలుతూ పగుళ్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు పరిచి వాటిపై రోడ్లు వేస్తున్నారు. గంటల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నారంటే నాణ్యత ఏ మేరకు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏండ్ల పాటు నిలవాల్సిన రోడ్లు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు నిధులు ఖర్చుచేయడంపై ఉన్న శ్రద్ధ పనుల నాణ్యతపై ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయలతో వేస్తున్న సీసీ రోడ్లు పైపై పూతల్లా తయారయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు నాణ్యతగా చేపట్టేలా పర్యవేక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఈ సీసీ రోడ్డు లింగాపూర్ మండల కేంద్రంలోనిది. రూ.5లక్షలతో వేస్తున్న రోడ్డు నిర్మాణం మరింత దారుణంగా ఉంది. ఓ వైపు వేస్తుండగానే మరో వైపు పగుళ్లు తేలుతున్నది. రోడ్డు నిర్మాణంలో వినియోగించాల్సిన సిమెంట్, ఇసుక, కాంక్రిట్ సరిగా వేయడం లేదని మట్టిపై కవర్లు కప్పి నిర్మాణం నాసిరకంగా చేపడుతున్నారని గ్రామస్తులు ఆరో పించారు. రోడ్డు నాణ్యతను అధికారులు ఎవరూ పర్యవేక్షించడం లేదని, దీంతో కాం ట్రాక్టర్లు ఇష్టానుసారంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.