ఆదిలాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సాగు చేసే వారు. క్రమంగా ప్లాట్లు ఏర్పడి ఇండ్లు కట్టుకోవడంతో చెరువులు వ్యవసాయానికి ఉపయోగపడడం లేదు. ఈ చెరువులు వర్షాకాలంలో నిండడంతో భూగర్భజలాలు పెరిగి పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులకు నీటి కొరత లేకుండా ఉపయోగపడుతాయి. వేసవిలో పశువులకు తాగునీటి సమస్య లేకుండా ఉపయోగపడుతాయి. పట్టణవాసులకు పలు రకాల ప్రయోజనాలను చేకూర్చే చెరువులను కాపాడాల్సిన అధికారులు వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఫలితంగా చెరువులు క్రమంగా కబ్జాలకు గురి అవడంతో గుర్రం డెక్కలతో నిండిపోయి ప్రమాదకరమైన స్థితికి చెరుకున్నాయి.
వర్షాకాలంలో ఇబ్బందులు
చెరువుల్లోని బఫర్జోన్లు కబ్జాలకు గురికావడంతో వర్షాకాలంలో పరిసర కాలనీవాసులు గతేడాది ఆగస్టులో కురిసిన వర్షాలతో పరిసర కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరిం ది. మత్తడి ద్వారా చెరువుల నీరు బయటకు పోవాల్సి ఉండగా దారి లేకపోవడంతో ఇండ్లలోకి నీరు చేరింది. కలెక్టర్ సూచన మేరకు ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు సర్వే చేసి బఫర్‌జోన్ కబ్జాలను గుర్తించారు. కబ్జాదారులకు నోటీసులు పంపిణీ చేశామని మున్సిపాల్ అధికారులు తెలిపారు. కబ్జాదారుల విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో పరిసర కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పేలా లేవు. చెరువుల్లో చెత్తాచెదారం నిండిపోవడం, మురికినీరు పేరుపోవడం, గుర్రం డెక్క, పిచ్చమొక్కలతో అస్తవ్యస్తంగా మారడంతో దుర్గందం వెదజల్లుతున్నది. అధికారులు స్పందించి పట్టణంలోని చెరువులకు పుర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.