కన్నెపల్లి, సెప్టెంబర్ 20 : ఎగువన కురుస్తున్న వర్షాలకు చిన్న తిమ్మాపూర్-తంగళ్లపల్లి గ్రామాల మధ్యనున్న ఎర్ర వాగు ఉప్పొంగగా, ట్రాక్టర్‌తో సహా ఆరుగురు కూలీలు అందులో చిక్కుకున్నారు. మాడవెల్లి గ్రామపంచాయతీలోని బొత్తపల్లికి చెందిన అట్కారి రవి అనే రైతు ట్రాక్టర్లో మందు బస్తాలు వేసుకొని, ఐదుగురు కూలీలతో కలిసి వాగు అవతల ఉన్న తిమ్మాపూర్‌లోని పతి చేనుకు చేరుకున్నాడు.
పత్తికి మందు వేసి తిరిగి వస్తున్న క్రమంలో వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ట్రాక్టర్‌తో సహా అందులో చిక్కుకుపోయారు. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి తాళ్ల సాయంతో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ట్రాక్టర్ వాగులోనే ఉండిపోయింది. కాగా, ఎర్రవాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.