ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) శోభ సంతరించుకుంది. గతేడాది ఇదే నెలలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాలో పర్యటించినపుడు ఐటీ టవర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మిస్తున్నారు. పనులు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు కంపెనీల్లో 220 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుండగా.. టవర్ నిర్మాణం పూర్తయితే దాదాపు వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
కంపెనీలు ప్రారంభం కాక ముందు ఉన్నత చదువులు అభ్యసించిన యువత హైదరాబాద్, బెంగళూరు, పూణె లాంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత జిల్లాలో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఐదంకెల జీతం తీసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ)
దిలాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా పేరుగాంచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా ప్రగతిలో ఆదిలాబాద్ ఇతర జిల్లాలతో పోటీ పడుతోంది. జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా.. గతేడాది సెప్టెంబర్ 26న జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్లో ఐటీ టవర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
స్థానికంగానే ఉద్యోగావకాశాలు
ఉమ్మడి రాష్ట్రంలో జరగని అభివృద్ధి కేవలం పదేండ్లలో జరిగింది. హైదరాబాద్, బెంగళూరు, పూణె లాంటి నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తుండడంతో ఆదిలాబాద్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. కంపెనీని ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేయడంతో అటు మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రూ.1.50 కోట్లతో ఐటీ కంపెనీల్లో వసతులు కల్పించారు.
ప్రభుత్వం అందించిన సహకారంతో ఆదిలాబాద్లో రెండేళ్ల కిందట బీడీఎన్టీ ఐటీ కంపెనీ ప్రారంభం కాగా.. అందులో 120 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. నెల రోజుల కిందట జిల్లా కేంద్రంలో ఎన్టీటీ డాటా ఐటీ కంపెనీ ప్రారంభం కాగా ఇందులో 100 మందికి ఉద్యోగాలు లభించాయి. రెండేళ్లలోనే జిల్లాకు రెండు ఐటీ కంపెనీలు రాగా 220 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మంచి వేతనాలతో పని చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీలు ప్రారంభం కాక ముందు ఉన్నత చదువులు అభ్యసించిన యువత ఐటీ కంపెనీల్లో పని చేయడానికి హైదరాబాద్, బెంగళూరు, పూణె లాంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత జిల్లాలో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు.
రూ.40 కోట్లతో ఐటీ టవర్
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం విస్తృత పర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులను టీఎస్ఐఐసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని హంగులతో 50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తుండగా.. ఏడాదిన్నరలో పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పలు కంపెనీలు ఈ టవర్లో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలు ఉండగా.. 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. జిల్లాలో ఇప్పటికే నడుస్తున్న రెండు ఐటీ కంపెనీల్లో 220 ముంది ఉద్యోగాలు చేస్తుండగా వచ్చే రెండేళ్లలో వేయి మందికి ఉపాధి కల్పించే విధంగా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో జిల్లాలో ఐటీ రంగాన్ని విస్తరించి వచ్చే ఐదేళ్లలో 2 వేల మందికి ఉపాధి కల్పించేందుకు స్థానిక నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటు ఫలితంగా జిల్లా అభివృద్ధి సుగుమం కానుంది. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరుగడంతోపాటు పరోక్షంగా స్థానికులకు ఉపాధి లభింనుంది. జిల్లాలో ఐటీ కంపెనీలు ఏర్పాటుపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ పరిశ్రమలతో అభివృద్ధి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో ప్రభుత్వం ఆదిలా బాద్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటు చేయడంపై వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. గతంలో నగరాలకు పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్ జిల్లాకు విస్తరించడం జిల్లా ప్రజలకు గర్వకారణం. ప్రస్తుతం రెండు ఐటీ కంపెనీల్లో 220 మంది ఉద్యోగాలు చేస్తుండగా, నిర్మాణం జరుగుతున్న ఐటీ టవర్లో 1000 మందికి భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ పరిశ్రమల కారణంగా జిల్లాలోని ఇతర రంగాలు అభివృద్ధి చెందుతాయి.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్.