నస్పూర్,నవంబర్ 28 : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారంస్థానిక కలెక్టరేట్లో 2వ, 3వ విడుత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ నుంచి ఫలితాలు ప్రకటించే వరకూ ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్లను తీసుకోకూడదన్నారు.
విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రతి అభ్యర్ధి తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా సమర్పించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి శంకర్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
దండేపల్లి, నవంబర్28 : సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శుక్రవారం కొర్విచెల్మ, నెల్కివెంకటాపూర్, ద్వారక, మేదరిపేట, దండేపల్లి జీపీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 29న సాయంత్రం ఐదు గంటలలోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలన్నారు. అనంతరం ద్వారకలో కొనసాగుతున్న బాలుర వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంత చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్ ఉన్నారు.