మంచిర్యాల, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన మిల్లర్లపై సర్కారు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని సీఎంఆర్ పెట్టడానికి మిల్లులకు ఆరునెలల సమయం ఉంటుంది. కానీ గడిచిన రెండు, మూడేళ్లుగా కొందరు మిల్లర్లు ఏడాది సమయం తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం కొంత మేర ధాన్యం సీఎంఆర్ పెట్టి.. మిగిలిన ధాన్యాన్ని బయట అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి మిల్లర్లకు ఎంత ధాన్యం ఇచ్చాం. ఎంత సీఎంఆర్ ఇవ్వాలి. మిల్లర్లు ఎంత సీఎంఆర్ ఇచ్చారు. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అని.. ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలకు సంబంధించి మిల్లుర్లు సీఎంఆర్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టిన రూ.7,650 కోట్ల విలువ చేసే 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసింది. వేలం పాడిన వారికి రూ.2,789 కోట్లు విలువ చేసే 13.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించింది. మిగిలిన ధాన్యం మా దగ్గర లేదంటూ కొందరు మిల్లర్లు చేతులు ఎత్తేయడంతో ధాన్యానికి బదులు డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,861 కోట్లు రావాల్సి ఉండగా, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కొందరు మిల్లర్లు రూ.100 కోట్లు బకాయి పడ్డారు.
రెండు రోజుల్లో కట్టాల్సిందే..
మంచిర్యాల జిల్లాకు సంబంధించి 63,144 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని వేలం వేయగా, కేవలం 10,268 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి దాకా లిఫ్ట్ చేశారు. ఇంకా 52, 876 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. దీనివిలువ రూ.100 కోట్లు ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వానికి బకాయి పడిన 23 మిల్లర్ల వివరా లు ఇలా.. రాఘవేంద్ర ఇండస్ట్రీస్(జన్నారం) రూ.12.86 కోట్లు, రాజరాజేశ్వరి ట్రేడర్స్(నర్సింగాపూర్)రూ.9.96 కోట్లు, రామలక్ష్మణ్ ఇండస్ట్రీస్(లింగాపూర్ దండేపల్లి) రూ.8.60 కోట్లు, గాయత్రి పీఎంఆర్బీ (సబ్బపల్లి హజీపూర్) రూ.7.20 కోట్లు, శ్రీసాయి మణికంఠ ట్రే డర్స్ (నర్సింగాపూర్)రూ.5.54 కోట్లు, వరలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇందారం జైపూర్) రూ.3.96 కోట్లు, శ్రీలక్ష్మి శ్రీనివాస ఇండస్ట్రీస్ (నందులపల్లి నెన్నెల) రూ.2.79 కో ట్లు, లక్ష్మీగణపతి(అందుగులపేట్) రూ.2.73 కోట్లు, జయలక్ష్మి ఇండస్ట్రీస్(ఇందారం) రూ.2.55 కోట్లు, శ్రీనివాస రైస్ మి ల్-మహాలక్ష్మి ట్రేడర్స్ (హమాలీవాడ మంచిర్యాల) రూ. 2.02 కోట్లు, ఎస్ఆర్ఎం ఇండస్ట్రీస్ (సబ్బేపల్లి) రూ. 2. 01 కోట్లు, వాసవి పీఎంఆర్ఎం (అందుగులపేట్ ఎంఎంఆర్) రూ.1.94 కోట్లు, శివసాయి ఈపీ లక్ష్మీపూర్(లక్షెట్టిపేట) రూ.1.93 కోట్లు, వెంకటేశ్వర ఎంపీఆర్బీ (కన్నెపల్లి దండేపల్లి) రూ.1.82 కోట్లు, రాధాకృష్ణా ఇండస్ట్రీస్ (కన్నెపల్లి దండేపల్లి) రూ.1.28 కోట్లు, శ్రీ శివరామకృష్ణ ట్రేడ ర్స్ (మిట్టపల్లి) రూ. 16 లక్షలు, బీఎస్‌వై రా-రైస్ మిల్ (ముదిగొండ) రూ.8.49 కోట్లు, దుర్గ ఇండస్ట్రీస్ (నర్సింగాపూర్) రూ.8.16 కోట్లు, హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్(మంచిర్యాల) రూ.6.21 కోట్లు, వాసవీమాత మాడ్రన్ రైస్ మిల్(తాండూర్) రూ.5.79 కోట్లు, శ్రీ వెంకట రమణ ఆగ్రో ఇండస్ట్రీస్ (కోటపల్లి)రూ.1.78 కోట్లు, సోమేశ్వర రైస్ మిల్(ఆస్నాద్) రూ.1.76 కోట్లు, శ్రీ రాజరాజేశ్వర మోడ్రన్ రైస్ మిల్ రూ.1.01 కోట్లు బకాయి పడ్డాయి. ఈ మిల్లులన్నీ శనివారం లోగా పెండింగ్ పడిన మొత్తాన్ని క్లియర్ చేయాలని అధికారులు ఆదేశించారు.
గతంలోనూ కేసులు.. ధాన్యం కేటాయించాలంటున్న మిల్లర్లు..
సీఎంఆర్ ఇవ్వకుండా, మిల్లులో ఆ ధాన్యం చూపించకుండా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే ఏడుగురు మిల్లర్లపై ఆర్ అండ్ ఆర్ యాక్ట్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఒకరిద్దరు మిల్లర్లను అరెస్టు సైతం చేశారు. కాగా జిల్లాలో 34 మిల్లులు 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం డబ్బులు కట్టాల్సి ఉందని మిల్లర్లు అంటున్నారు. కొందరు మిల్లర్లను తప్పించి ఉద్దేశపూర్వకంగా కేవలం 23 మిల్లులపైనే కేసులు పెట్టేందుకు అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 34 మిల్లులు డబ్బులు కట్టాల్సి ఉంటే.. కేవలం 23 మిల్లులపైనే కేసులు ఎందుకో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పక్షపాతధోరణితో కులవివక్ష చూపుతూ కేసులు నమోదు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. రెండు రోజుల్లో పెండింగ్ పడిన కోట్లాది రూపాయాలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో చెప్పాలంటున్నారు.
ధాన్యం కేటాయించి కొంత సమయం ఇస్తే పాత, కొత్త పెండింగ్ ధాన్యాన్ని ఇచ్చేందుకు మిల్లర్లం సిద్ధంగా ఉన్నామంటున్నారు. 2022-23 రబీ ధాన్యాన్ని దించేప్పుడు పూర్తిగా సహకరిస్తామని చెప్పిన అధికారులే ఇప్పుడు మామీద కక్ష కట్టారని వాపోతున్నారు. ఆ ఏడాది వర్షాల కారణంగా దించుకున్న ధాన్యం తడిసిపోయి నష్టపోవాల్సి వచ్చిందని, ఆ ధాన్యాన్ని మరాడిస్తే నూకలు తప్ప ఏం రాలేదని.. దాన్ని సగం ధరకు అమ్ముకొని వచ్చే సీజన్లో ధాన్యంతో కవర్ చేద్దామనుకున్నామని చెబుతున్నారు. ధాన్యం ఇస్తే తప్ప పెండింగ్ బకాయిలు కట్టలేమని ఆర్ అండ్ ఆర్ చట్టం కింద మా ఆస్తులు జప్తు చేసినా పెండింగ్ ఉన్న మొత్తం రాదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లర్ల మెడపై కత్తి పెట్టడం ఎంత వరకు సమంజసమని వాపోతున్నారు. ప్రభుత్వం తమ పక్షాన సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నారు.
మిల్లర్లపై క్రిమినల్ కేసులు
– మోతీలాల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల జిల్లా
2022-23 రబీ సీజన్‌కు సంబంధించి మిల్లర్లు కట్టాల్సిన మొత్తం శనివారం లోగా చెల్లించాలి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. ఈ రెండు రోజుల్లో 50శాతం వేలం వేసిన ధాన్యం డబ్బులైనా కట్టాలి. లేనిపక్షంలో మిల్లర్లు, వారి ష్యూరిటీ/గ్యారంటీదార్లపై సంయుక్తంగా కేసులు నమోదు చేస్తాం.