ఆదిలాబాద్ : సీసీఐ పత్తి ( CCI Cotton ) కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమని మాజీమంత్రి జోగురామన్న (Jogu Ramanna) ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందన్నారు. కొనుగోళ్లలో భారీగా అవినీతి జరగడం, మార్కెట్ సెక్రెటరీ ని సస్పెండ్ చేసే పరిస్థితికి కారణమెంటని ప్రశ్నించారు. స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పత్తి కొనుగోళ్లలో రాత్రికి రాత్రి విధించిన కూడు గోన విధానం కొనుగోళ్ల అవినీతికి తెరతీసారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
కొనుగోళ్లలో కనీస శ్రద్ధ చూపలేదని, అధికారులతో కనీసం ఒక్క సమీక్ష సమావేశాన్ని సైతం నిర్వహించలేదని విమర్శించారు. గత పదేళ్లలో ఇంతకంటే భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగినా, ఎటువంటి అవినీతి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి పత్తిని తీసుకువచ్చి కౌలు రైతుల పేరిట విక్రయించారని, ఇందులో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సీసీఐ లో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రలాద్, మారిశెట్టి గోవర్ధన్, దమ్మాపాల్, కొండ గణేష్, బట్టు సతీష్, అప్కామ్ గంగయ్య , దాసరి రమేష్, బుట్టి శివకుమార్, దేవిదాస్, అడపా తిరుపతి, నవతే శ్రీనివాస్, ఉగ్గే విట్టల్, ఖలీమ్, తదితరులు పాల్గొన్నారు.