ప్రగతి సాధకుడు, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆదివాసీ జిల్లా ఆసిఫాబాద్ అభివృద్ధికి అడ్డాగా మారింది. గిరిజనుల ఆరాధ్యదైవం, పోరాటయోధుడు కుమ్రం భీం స్ఫూర్తితో నిధుల వరద పారుతున్నది. దశాబ్దాలుగా ప్రగతికి నోచుకోని ప్రాంతం.. స్వరాష్ట్రంలో జిల్లాగా ఆవిర్భవించడం.. గూడేలు, తండాలు పంచాయతీలుగా మారడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. గిరి వికాసం పథకం ద్వారా బోర్లు వేయించి సాగునీటి వసతి కల్పిస్తున్నది. మెడికల్ కళాశాల మంజూరు కావడం, 30 పడకల దవాఖానను 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా 3,274 కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి 1,26,106 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి శుద్ధ జలం అందిస్తున్నారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సిర్పూర్ పేపర్ మిల్లును పునఃప్రారంభించి 1,500 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించారు. గ్రామాలకు అభివృద్ధి ఫలాలు అందుతుండడం, ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరుతుండడంతో అడవి బిడ్డలు సంతోషంగా ఉన్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది. గిరిజనులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోడు పట్టాలు అందించేందుకు, సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు నేడు(శుక్రవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, ఉచితంగా చేపపిల్లల పంపిణీ, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ, దళితబంధు, గిరివికాసం వంటి పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ప్రతి ఇంట్లోను ఉన్నారు.
ఉద్యానవన శాఖ
ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల పరిధిలో 2014 నుంచి 2023 సంవత్సరం వరకు సూక్ష్మ సేద్య పథకం ద్వారా 1,130 మంది రైతులకు రూ.2.37 కోట్ల విలువైన బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీపై అందించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో 502 ఎకరాల్లో ఆయిల్ పాం తోటలు ఏర్పాటు చేసుకున్న 126 మంది రైతులకు రూ.55.31 లక్షలతో 28,690 ఆయిల్ పాం మొక్కలను రాయితీపై అందించారు. రూ.42 కోట్ల నాబార్డ్ నిధులతో 70 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 13 గోదాములను నిర్మించారు. జి ల్లా పరిశ్రమల శాఖ 215 పరిశ్రమలకు అనుమతులు జారీ చేసింది. రూ.767 కోట్ల పెట్టుబడితో 2,084 మందికి ఉ పాధి కల్పించి 180 పరిశ్రమలలో ఉత్పత్తి ప్రారంభించారు. బీ-ఐడీయా, టీ-ప్రైడ్ పథకాల ద్వారా 315 మంది లబ్ధిదారులకు రూ.225 కోట్లతో రాయితీ మంజూరు చేశారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను సర్కారు అందిస్తున్నది. జిల్లాలోని 251 చెరువులు, నాలుగు రిజర్వాయర్లు, పది పెద్ద చెరువుల్లో 137 కోట్ల చేప పిల్లలను వదిలారు. జిల్లాలో ఐదు వేల మత్స్యకారుల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. 52 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉండగా.. 2,545 మంది సభ్యులు ఉన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రూ.25 కోట్లతో మోపెడ్ వాహనాలు, రెండు చేపల మార్కెట్లు, రెండు పెద్ద వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది.
గొర్రెల పంపిణీ
జిల్లాలో 2,215 మంది గొల్ల కుర్మలకు 75 శాతం రాయితీపై గొర్రెలను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికిగాను ఇప్పటివరకు రూ.9.11 కోట్ల విలువ చేసే గొర్రెల యూనిట్లను అందించారు. రెండో విడుతలో 182 యూనిట్లను అందించారు.
రైతు బంధు
రైతుబంధు పథకాన్ని 2018లో ప్రారంభించగా.. మొదటి సంవత్సరం ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రెండు విడుతలుగా రూ.8 వేలు చెక్కుల రూపంలో ఇచ్చింది. అనంతరం ఎకరాకు రూ.5 వేల చొప్పున యేడాదికి రెండు విడుతలుగా రూ.10 వేలను అందిస్తోంది. 2018 నుంచి 2022 సంవత్సరం వరకు 1,12,693 మంది రైతులకు రూ.1,636 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రైతు బీమా
రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పటి వరకు 1,943 మంది రైతులు చనిపోగా.. వారి నామినీ ఖాతాల్లో రూ.97.15 కోట్లు జమ చేసింది.
ఆసరా పింఛన్లు
జిల్లావ్యాప్తంగా 56,910 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతి నెల దాదాపు రూ.12.75 కోట్లు ఖర్చు చేస్తోంది. స్త్రీనిధి పథకం ద్వారా రూ.133 కోట్లు అందించింది.
ఎస్పీఎంతో పారిశ్రామిక అభివృద్ధి
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురై 2014లో మూతబడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని 2018లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పరిశ్రమ పునఃప్రారంభానికి అనేక రాయితీలు కల్పించారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 1,500 మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
రుణమాఫీ
రుణమాఫీ పథకంలో భాగంగా 2014 సంవత్సరంలో 54,047 మంది రైతులకు రూ.197.66 కోట్లు, 2018 సంవత్సరంలో 4,317 మందికి రూ.13.30 కోట్లను రుణమాఫీ చేసింది. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల చొప్పున 70 వేదికలను రూ.15.40 కోట్లతో నిర్మించింది. 7,396 మంది రైతులకు రూ.9.42 కోట్లతో 195 ట్రాక్టర్లు, 7,201 యాంత్రీకరణ పనిముట్లను అందించింది.
వైద్య, ఆరోగ్య శాఖ
వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా 30 పడకల ఆస్పత్రిని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు, టీ-హబ్, ఆక్సిజన్ ప్లాంట్, ఎస్ఎన్సీయూ, ఆర్టీపీసీఆర్ ల్యాబ్, ఎన్సీడీ క్లినిక్, డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. భవన నిర్మాణానికి రూ.48 కోట్లు మంజూరు చేయడంతో భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాకు రూ.9 కోట్లతో 330 పడకల ఏరియా ఆస్పత్రిని మంజూరు చేసింది. రేడియాలజీ, డయాలసిస్ యూనిట్, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్లను మంజూరు చేసింది.
కేసీఆర్ కిట్స్
ప్రభుత్వ దవాఖానల్లోనే దాదాపు 72 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణులు ప్రసవానికి ముందు, తర్వాత ఆస్పత్రికి వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రభుత్వం కల్పించిన 102 అమ్మ ఒడి అంబులెన్స్‌లు, 108 అంబులెన్స్‌లను ఉపయోగించుకుంటున్నారు. ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో కలిపి 18,240 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు అందించారు.
న్యూట్రిషియన్ కిట్లు
జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ల పథకాన్ని 2022 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1,944 మంది గర్భిణులకు పౌష్టికాహారం కిట్లను అందించారు. రక్తహీనత తగ్గి ప్రసవ సయమంలో ఇబ్బందులు కలుగకుండా, సాధారణ, సుఖ ప్రసవం అయ్యేందుకు అమలు చేస్తున్నారు.
గిరి వికాసం
గిరిజన రైతుల భూములకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం గిరివికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. దీని ద్వారా 119 మంది రైతులకు వంద శాతం సబ్సిడీపై బోర్లను వేయించి సాగునీటి వసతి కల్పించింది. గతంలో ఇందిర జలప్రభ ద్వారా తవ్విన 45 బోర్లకు మోటార్లను అందజేసింది. జిల్లాలో గిరిజన రైతులకు 481 విద్యుత్, పంపుసెట్లు ఏర్పాటు చేశారు. రూ.4.77 కోట్లతో 37 బోరు బావులకు విద్యుత్ వసతి కల్పించారు.
దళితబంధు వరం
దళితబంధు పథకం ద్వారా 177 మందికి రూ.17.70 కోట్లు అందించింది. ఒక్కొక్క యూనిట్‌కు రూ.10 వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసింది. కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ ఫాంలు, వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.