ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజ్యమేలుతున్నది. ఎమ్మెల్యేలపై పార్టీలోని సీరియన్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌పై స్థానిక సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకులను కాదని ఇటీవల వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే మారకపోతే తమ దారి తాము చూసుకుంటామంటూ సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం సంచలనంగా మారింది. ఇది మరవక ముందే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుపై గఢ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇదే తరహా విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్ర మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌పై సీనియర్ లీడర్ విమర్శలు చేయడంతోపాటు ఏఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి విషయమై స్థానికంగా చర్చ నడుస్తున్నది. ఆ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిపై సొంత పార్టీ నాయకులే ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడగొట్టాలంటూ వారంతా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా కింది స్థాయి కేడర్ నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం చర్చనీయాంశంగా మారింది.
– మంచిర్యాల, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ ఒక్కరి మధ్య సఖ్యత లేదు. ఒక్కరంటే ఒకరికీ పడని దుస్థితి నెలకొన్నది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, స్థానిక నాయకుల నుంచి అంతర్గత పోటీ నడుస్తున్నది. ఓడిపోయిన అభ్యర్థులకు తామే ఆల్టర్నేట్ అంటూ, వచ్చే ఎన్నికల్లో ఎమ్మె ల్యే టికెట్ తమకే అంటూ మరికొందరు లీడర్లు తయారయ్యారు. కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ ఇలా ఏ నియోజకవర్గం చూసుకున్నా వర్గపోరు నడుస్తున్నది. ఆదిలాబాద్‌లో కంది శ్రీనివాస్‌రెడ్డి ఉండగానే మొన్నీమధ్యే ఆయనకు వ్యతిరేకవర్గాన్ని పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయినట్లయింది.
నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రె స్ పార్టీ నుంచి పోటీ చేసిన సీనియర్ లీడర్ శ్రీహరిరావు ఉండగానే, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. దీంతో అక్కడ అధికార పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి. కాగజ్‌నగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీలో చేశారు. ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నారాయణరావు పటేల్ పోటీ చేసి ఓడిపోయాక మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి హస్తం పార్టీలో చేశారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో నూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు నడుస్తున్నది. మంచిర్యాల జిల్లాలో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒకరంటే ఒకరికి పడడం లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్కు చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్లకు ముందు నుంచి పడడం లేదు. మంత్రి పదవి విషయంలో వచ్చిన గ్యాప్ రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ప్రేమ్‌సాగర్‌రావు తమ్ముడు గెలుపొందడంతో ఎమ్మెల్యేల మధ్య అంతరం తారాస్థాయికి చేరింది.
తాజాగా గడ్డం బ్రదర్స్‌కు కూడా పొసగడం లేదని తెలిసింది. దసరా వేడుకల కోసమని బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంకు వచ్చిన మంత్రి వివేక్‌ను ఎమ్మెల్యే వినోద్ అసలు పట్టించుకోలేదు. ఆయన కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయాక ఎమ్మెల్యే వచ్చి అదే ప్రొగ్రామ్‌లో పాల్గొన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఇద్దరు అన్నదమ్ములు కలుసుకోకపోవడం ఇద్దరికి చెడిందనే ప్రచారం నడుస్తున్నది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు మొదలుకొని.. మండలా లు, గ్రామస్థాయి నాయకుల వరకు అధికార పార్టీలో ఒకరంటే ఒకరిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే లపై సీనియర్ నాయకుల అసమ్మతి.. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య అనైక్యత.. స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారనున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో ఓట్లు పడడం కష్టమని సొంత పార్టీ నాయకులే వాపోతున్నారు. ఇన్చార్జి మంత్రి ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆయన దగ్గరకు వెళ్లడం లేదు. ఇప్పటికిప్పుడు వీటన్నింటిని సరిచేసే అవకాశలైతే కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకొని సమన్వయం చేస్తే తప్ప ఎన్నికల్లో వర్గపోరు ఆగేలా లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగానికిపైగా గ్రామాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తున్నది. నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమైన నాయకుల మధ్య ఉన్న వర్గపోరే క్షేత్రస్థాయి గ్రామాల వరకు ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో లీడర్ పేరు చెప్పుకొని తిరుగుతున్నా రు. చివరి నిమిషంలో పార్టీ బలపర్చలేని పక్షంలో ఇండి పెండెంట్గా పోటీ చేసైనా సరే సొంత పార్టీ నాయకులనే ఓడగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పరిస్థితుల న్నింటినీ చక్కదిద్దకపోతే ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.