మంచిర్యాల, మే 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మే 28 తేదీ బుధవారం నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
కా నీ.. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక ప్ర క్రియ కొలిక్కి రాలేదు. దీంతో తెలంగా ణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వడంపై నీలినీడలు కమ్ముకున్నా యి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ల్లో 1,54,210 మంది యు వ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉ మ్మడి జిల్లాకు ప్రభు త్వం మంజూరు చేసిన యూనిట్లు 50 వేలు కూడా లేదని తెలుస్తున్నది.
వచ్చిన అప్లికేషన్లకు మంజూరైన యూనిట్లకు భారీ తేడా ఉండడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. పథకం నిబంధనలను అనుసరించి ఒంటరి మహిళలు, అత్యంత వెనుకబడిన పేదలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల్లో ఈ కేటగిరీల్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించిన అధికారులు కలెక్టర్ల ఆమోదానికి పంపినట్లు తెలిసింది. ఈ కేటగిరీలో తప్ప ఇతర దరఖాస్తుల్లో లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికీ స్పష్టత రాలేదని సమాచారం.
సిబిల్ స్కోర్ వెరిఫికేషన్‌తో ఆలస్యం
రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లవారీగా విభజించారు. కులాలవారీగా రిజర్వేషన్లు అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. తొలి విడుతలో రూ.50 వేలు, రూ.లక్ష సాయానికి దరఖాస్తు చేసుకున్న వారికే మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. కులాల రిజర్వేషన్ల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి రావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. వచ్చిన దరఖాస్తులను మండల అధికారులు బ్యాంకర్లకు అందించారు.
దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ చెక్ చేసి, వారి పేరుపై ఏమైనా రుణాలు ఉన్నాయా? పరిశీలించి తిరిగి మండల అధికారులకు అప్పగించాలి. అలా సిబిల్ స్కోర్ బాగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేసి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి కలెక్టర్లకు ఆ జాబితాను పంపించారు. చాలా మండలాల్లో ఇంకా బ్యాంక్ సిబిల్ వెరిఫికేషన్ ప్రక్రియే పూర్తి కాలేదని తెలిసింది.
అధికారికంగా ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం మేరకు నిర్మల్ జిల్లాలో మొత్తం 35,184 దరఖాస్తులు రాగా 27,939 అప్లికేషన్లను బ్యాంక్ వెరిఫికేషన్‌కు పంపించారు. ఆదిలాబాద్ జిల్లాలో 42,352 దరఖాస్తులు రాగా 11,178, ఆసిఫాబాద్ జిల్లాలో 30,722 అప్లికేషన్లు రాగా 16,558, మంచిర్యాల జిల్లాలో 45,952 దరఖాస్తులు రాగా, 41,197 దరఖాస్తులు బ్యాంక్ వెరిఫికేషన్‌కు పంపించారు. వెరిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తుల్లో 60 శాతం కూడా పూర్తికాలేదని తెలిసింది. ఒకటి, రెండు బ్యాంక్‌లను ఆరా తీసినప్పుడు బుధవారం నాటి 40 శాతం నుంచి 60 శాతం వెరిఫికేషన్ పూర్తి చేశామని, ఆ వివరాలు అధికారులకు పంపించామని చెప్పారు. ఇలా బ్యాంక్ వెరిఫికేషన్ పూర్తయి, ఆ వివరాలు అధికారులకు రావడానికే నాలుగైదు రోజుల సమయం పట్టేలా ఉంది.
మంజూరైనవి తక్కువ యూనిట్లు
దరఖాస్తులను సిబిల్ స్కోర్‌తో ముడిపెట్టడంతో చాలా మంది ఆశావహులు అనర్హులుగా మారిపోతున్నారు. ఇలా ఎంత వడబోసినా అర్హులయ్యే వారి సంఖ్య సర్కారు మంజూరు చేసిన యూనిట్ల కంటే అధికంగా ఉంటుంది. అర్హులుగా ఎంపికయ్యే వారికి ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లకు అసలు పొంతనే లేకుండా పోతుందని తెలిసింది. నిర్మల్ జిల్లాలో 35 వేల మంది దరఖాస్తు చేసుకుంటే అన్ని కార్పొరేషన్లకు కలిపి 11,039 యూనిట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 42 వేల మంది దరఖాస్తు చేసుకుంటే 13,879 యూనిట్లకు మంజూరు ఇచ్చారు.
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ వివరాలు చెప్పడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని అదయ్యాక పూర్తి వివరాలు ఇస్తామని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో కలిపి ఓ 20 వేల యూనిట్లు అనుకున్నా వచ్చిన దరఖాస్తుల్లో 35 శాతం మందికి కూడా లబ్ధిచేకూరేలా లేదు. తక్కువ యూనిట్లు రావడంతో ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధం నెలకున్నది. అర్హులైన వారి చాలా మంది ఉన్న నేపథ్యంలో కొందరిని పక్కన పెట్టి కొందరికే ఇస్తే మిగిలిన వారి నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే అంశంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తీరా ఎంపిక చేశాక అధికార పార్టీ వారికే ప్రియార్టీ ఇచ్చారంటూ మిగిలిన వారు నిలదీస్తే ఏం చేయాలన్నది అర్థం కాకుండా పోయింది. సిబిల్ స్కోర్ వెరిఫికేషన్, అర్హులు ఎక్కువ మంది ఉండడం, సర్కారు మం జూరు చేసిన యూనిట్లు తక్కువగా ఉండడం మంజూరు పత్రాల జారీకి అడ్డుగా మారింది. ఈ స మస్యలను పరిష్కరించుకుని మంజూరు పత్రాలు ఇవ్వడం.. జూన్ 2వ తేదీ నాటికి పూర్తయ్యేలా లేద ని అధికారులు చెప్తున్నారు.
ఒకవేళ హడావుడి చేసి మొదలుపెడితే మిగిలిన పథకాల మాదిరిగానే జనం నుంచి వ్యతిరేకత రావొచ్చని భావిస్తున్నారు. ఈ పథకం అమలు విషయంలో ప్రభుత్వం హడావుడి చేసి అబాసుపాలవుతుందా? లేక నిధానంగా ప్ర క్రియ మొత్తం పూర్తి చేసి లబ్ధిదారులందరిని సంతృ ప్తి పరుస్తుందా? ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Ppp