ఇచ్చోడ, జూన్ 28 : మూడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతోపాటు సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నా జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రిజర్వేషన్లు కొనసాగుతాయా? లేక కొత్తగా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
ముందుగా పంచాయతీలకు..
గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీ, జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఈ యేడాది జనవరిలో మున్సిపాలిటీ పాలవర్గాల పదవీ కాలం ముగిసింది. అన్నింటికీ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30లోపు గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలకు రెడీ అవుతోంది. అయితే ముందుగా పంచాయతీలకు, ఆ తర్వాత పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
హైకోర్టు తీర్పుతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతోపాటు, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నాయకులు ఇప్పటికే ఆశావహులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే గెలుపు గుర్రాలను దాదాపు ఖరారు చేసి పోరుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా గత ఎన్నికల మాదిరిగానే మెజార్టీ స్థానాలపై కన్నేసింది. బీజేపీ కూడా స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపి విజయం సాధించే పనిలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. సీపీఎం, సీపీఐ పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆశావహులు సై అంటున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేనా!
స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశంపై అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుందా? లేదా? అని ఉతంఠ నెలకున్నది. బీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో చట్టం కాలేదు కాబట్టి ఈసారి అమలువుతుందో లేదో.. అయితే ఎంత మేరకు ఇస్తారో అనేది చర్చ మొదలైంది. అయితే పార్టీలే తాము ఇచ్చే టికెట్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించే ప్రతిపాదన కూడా వస్తోంది. గత ఎన్నికలకు ముందు చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్ రెండు విడుతలుగా ఉంటుంది. ప్రస్తుతం ఆ చట్టంపై ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషనే ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సర్వం సన్నద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. గ్రామపంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ల జాబితాలతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కూడా సంసిద్ధులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతోపాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీవో, ఏపీవోలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను ఆయా మండలాలకు ఇప్పటికే తరలించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.