పెంబి, జూలై 18 : ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నది. అలాగే రైతు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బంది పడొద్దనే రైతు బీమా అందిస్తున్నది. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉండి, గుంట భూమి ఉన్న సరే బీమాకు అర్హులను చేసింది. అన్నదాతకు రూపాయి ఖర్చు లేకుండా ప్రీమి యాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. రైతు బీమా పథ కంలో కొత్త రైతులను చేర్చుకునేందుకు ప్రభుత్వం ఆవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరానికి కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ప్రస్తుత లబ్ధ్దిదారుల వివరా ల్లో మార్పులు చేసుకునే వెసుబాటు కల్పించింది. గిరిజనులకు ఇటీవల అందజేసిన పోడు పట్టాలకు సైతం బీమా వర్తించనుంది. అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు, ఏ విధంగా నైనా రైతు మృతి చెందితే వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నది. వారి కుటుంబానికి భరోసా అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు బీమా పథకం ప్రవేశపెట్టారు. 2018 నుంచి ఈ పథకం అమలవుతున్నది. రైతు మృతి చెందితే కుటుంబ సభ్యులు స్థానికంగా వ్యవసాయాధి కారులకు సమాచారం అందిస్తే చాలు. వ్యవ సాయ అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిహారం అందిస్తారు. మండలంలో 2018 నుంచి ఇప్పటి వరకు 127 మంది రైతులు మృతి చెదగా వారి కుటుంబాలకు రైతు బీమా కింద రూ. 6.35 కోట్లు ప్రభుత్వం అందజేసింది. రైతుబీమా కింద మండలంలో 4265 మంది రైతులు నమో దు చేసుకున్నారు. నూతనంగా పట్టాలు పొందిన రైతులు, పోడు పట్టాలు పొందిన 1065 మంది రైతులు ఆగస్టు 5 లోపు వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు అర్హులు వీరే..
పంట భూమికి సంబంధించి రైతు పట్టాపాసు పుస్తకం కలిగి ఉండాలి. ఆధార్‌కార్డులో 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఈ ఏడాది జూన్ 19 వరకు పట్టాపాసు పుస్తకం పొందిన రైతులు మాత్రమే అర్హులు. నూతనంగా పోడు పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ని చోట్ల భూమి ఉన్న ఒక చోటనే అర్హులు. సంబంధిత రైతు స్వయంగా వెళ్లి దరఖాస్తు అందజేయాలి. పట్టాపాసు పుస్త కం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను అందజేయాలి.
రైతు బీమా అండగా నిలిచింది..
రైతు బీమా ద్వారా రూ. 5 లక్షలు మా కుటుంబానికి వచ్చాయి. ఆపదలో అండగా నిలిచాయి. మా నాన్న పేరు మీద 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. వ్యవసాయమే మాకు జీవనాధారం. 4 సంవత్సరాల క్రితం హఠాత్తుగా గుండె పోటుతో మా నాన్న మరణించాడు. వ్యవ సాయ అధికారులు మా ఇంటికి వచ్చి వివ రాలు సేకరించి వారం రోజుల్లో రూ. 5 రైతు బీమా డబ్బులు అకౌంట్లో వేశారు. రైతుభీమా మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచింది. ఇంత మంచి పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– భూక్యా రోహిదాస్(పెంబితండా)
ఆగస్టు 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
రైతు బీమా బాధిత కుటుంబానికి ధీమా కల్పిస్తున్నది. నూతనంగా కొత్తగా పట్టా పాసు పుస్తం పొందిన రైతులు రైతు బీమా కోసం అగస్టు 5 లోగా దరఖాస్తు చేసు కోవాలి. మండలంలో కొత్తగా పోడు పట్టా లు పొందిప 1065 మంది కూడా బీమా అర్హులే. వీరంతా దరఖాస్తు చేసుకోవాలి. పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లతో స్థానిక వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలి.
– రాజ్‌కుమార్, ఏఈవో(ఇటిక్యాల క్లస్టర్)