కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ జైనూర్, అక్టోబర్ 23 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో 21 మంది ఏఈవోలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైతుల సంక్షేమానికి వ్యవసాయ క్షేత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిషలు పనిచేసే ఔట్సోర్సింగ్ వ్యవసాయ విస్తరణ అధికారులను ఒకేసారి పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడంతో వారంతా ఆందోళన బాటపట్టారు. ఎనిమిది నెలలుగా వేతనాలు అందకపోయినా, కుటుంబ పోషణ భారంగా మారినా అప్పులు చేసి మరీ అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఏఈవోలపై కాంగ్రెస్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ఏఈవోలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఏఈవోలకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోగా సస్పెన్షన్ వేటు వేయడంతో వారు ఆందోళన బాటపడుతున్నారు. మరోవైపు పంటలకు చేతికి వచ్చే సమయంలో గ్రామాల్లో ఏఈవోల పాత్ర ఎంతో కీలకమైనదని, ఈ పరిస్థితిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎనిమిది నెలలుగా నో సాలరీ..
జిల్లాలో 50 మంది రెగ్యులర్ ఏఈవోలు ఉండగా ఔట్‌సోర్సింగ్‌పై 21 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఏఈవోలతో సమానంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈవోలు ప్రభుత్వం అమలు చేసే పథకాలను అర్హులకు అందించడంతో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత మార్చి నుంచి వీరి వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటీవల వీరిపై అనేక రకాల పనిభారం పడింది. డిజిటల్ సర్వే పేరుతో ప్రభుత్వం అదనపు పనిభారాన్ని మోపడం, నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయికి వెళ్లి విధులు నిర్వహించేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు కలుగుతుండడంతో విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. వీరిపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వీరిపై కఠినంగా వ్యవహరించి సస్పెండ్ చేసింది.
సర్వేలతో మరింత పనిభారం..
ఏఈవోలపై రోజురోజుకూ పనిభారం పెరుగుతున్నది. ఇటీవల సర్కారు చేపట్టిన రుణమాఫీతో రెండు నెలలుగా ఏఈవోలు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల నుంచి విమర్శలు సైతం ఏఈవోలపై వస్తున్నాయి. రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వారి సందేహాలు నివృత్తి చేయడం, పంటల సర్వేలు చేపట్టడం, ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సర్వేలు అడుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండేది. రైతుల కోసం నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లో నిరంతరం పనిచేసే ఏఈవోలపై పనిభారం పెరుగడం నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బయట అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొన్నది. ఏఈవో పరిస్థితి దుర్భరంగా మారింది.
ఎనిమిది నెలలుగా వేతనాలు రావడం లేదు
మాకు ఎనిమిది నెలలుగా వేతనాలు రావడం లేదు. రైతుల కోసం నిరంతరం కష్టపడి చేసే మాకు కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ప్రభుత్వం వివిధ సర్వేల పేరుతో మాపై పనిభారం మోపుతున్నది. రెగ్యులర్ ఏఈవోలతో సమానంగా మాతో పనిచేయిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సెలవులు కూడా వినియోగించుకోకుండా పనిచేస్తున్నాం. అలాంటి మాపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
-మెస్రం రాము ఔట్సోర్సింగ్ ఏఈవో, జంగాం క్లస్టర్, జైనూర్
సస్పెండ్ చేయడం సరికాదు
మా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే మాపై కఠినంగా వ్యవహరిస్తున్నది. ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోగా వివిధ రకాల సర్వేల పేరుతో మాతో తీరిక లేకుండా పనిచేయిస్తున్నది. మాకు రావాల్సిన ఎనిమిది నెలల వేతనాలు వెంటనే విడుదల చేయడంతోపాటు మా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి.
– ఖలీల్, ఔట్సోర్సింగ్ ఏఈవో, కంచన్‌పల్లి క్లస్టర్, లింగాపూర్