హాజీపూర్, డిసెంబర్ 3 : గురుకులాల బాటను అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య డిమాండ్ చేశారు. మంగళవారం గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే, ముల్కల్లలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను సందర్శించేందుకు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులతో వెళ్లారు. విద్యాలయాల్లోకి వెళ్లకుండా ప్రిన్సిపాళ్లు అడ్డుకోగా, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయాచోట్ల ప్రధాన ద్వారాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో సర్కారు విఫలమైందని, అందువల్లే గురుకులాల బాటను అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాలను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల అవి అధ్వానంగా మారాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు అఖిల్, సత్యం, హాజీపూర్ మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, నాయకులు ఆసా ది ప్రవీణ్, చెరుకు శ్రీనివాస్, బొద్దు రవి, బల్లెపు వినోద్ పాల్గొన్నారు.