శ్రీరాంపూర్ : సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులు, వారి పిల్లలను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) ద్వారా విద్యా అవకాశాలు కల్పించి పట్టభద్రులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani) , సీఎండీ ఎన్ బలరామ్ (CMD Balram) అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
కార్మికులను, వారి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై త్వరలోనే సమగ్ర ప్రణాళిక రూపొందించి, అంబేద్కర్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ మంచి పేరు సాధించిందన్నారు. సింగరేణి వ్యాప్తంగా బోధనకు అనుకూలమైన భవనాలను కేటాయిస్తే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా అందరినీ గ్రాడ్యుయేట్లుగా మార్చడమే తమ లక్ష్యమని వెల్లడించారు.