భీంపూర్, జనవరి 9: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్‌గంగ పరీవాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్‌కోటి మధ్య గంగ జాతర సంప్రదాయబద్ధంగా మొదలైంది. సోమవారం గురుశిష్యులు రాంనందన్, మాధవరావుల సమాధుల వద్ద భక్తులు పూజలు చేశారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. గంగమ్మకు గారెప్పాల నైవేద్యం సమర్పించారు. ఈ గంగజాతర ఉమ్మడి జిల్లాలోని పురాతన జాతరల్లో ఒకటి.
శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో రాంనందన్, మాధవరావు మహారాజులుండేవారు. వీరు ఇక్కడ జనహితం కోసం బోధనలు చేసేవారు. ఈ క్రమంలో ప్రతి యేటా గ్రామంలో బూరెలు, నేతితో నగర భోజనం చేసేవారు. గంగమ్మకు నైవేద్యాలు సమర్పించేవారు. ఒకసారి ఈ నగర భోజనంలోకి నెయ్యి అయిపోయింది. వెంటనే రామానంద మహారాజ్ ఒక ఖాళీ బిందెను తీసుకొని గంగ వద్దకు వెళ్లి అమ్మను ప్రార్థించాడు. గంగలో బిందెను ముంచి తీసేసరికి స్వచ్ఛమైన నెయ్యి వచ్చింది. ఈ నేతితోనే అప్పుడు పది గ్రామాలకు సరిపడా భోజనాలు వండి వడ్డించినట్లు కథనం. అప్పటి నుంచే ఇక్కడ జాతర మొదలైంది. 1889 నుంచి మొదలైన ఈ జాతరకు ఇప్పుడు 134 ఏళ్లు.
గంగజాతరకు స్థానిక గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ రంగుల రాట్నాలు, వివిధ తినుబండారాల దుకాణాలు, హోటళ్లు వెలిశాయి. జాతరలో పిల్లల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.