మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/లక్షెట్టిపేట, మార్చి 11: గ్రూప్-2 ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య-దేవక్క దంపతుల కుమారుడు గొడ్డే టి అశోక్ 7వ ర్యాంక్ సాధించాడు. 2024లో నవంబర్‌లో గ్రూప్-4 ఉద్యోగం సాధించి మంచిర్యాల కలెక్టరేట్లో పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యో గం చేస్తున్న ఈయనకు 2018లోనే ఫారెస్టు బీట్ ఆఫీసర్‌గా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఈయనకు వరుసగా నాలుగో ఉద్యోగం. దాదాపు ఏడేళ్లు కష్టపడి గ్రూప్-2 ఉద్యోగం సాధించానని, తన ర్యాంక్‌కు జోన్-1లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చే అవకాశముందని అశోక్ తెలిపారు. అశోక్ గ్రూప్-2 సాధించడంపై గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కౌటాల, మార్చి 11 : కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశం గౌడ్-తారక్కల(గీత కార్మికుడు) కుమారుడు సాయిరాం గౌడ్ గ్రూప్-2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. 2019లో మొదటి ప్రయత్నంలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2024లో గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రాగా, జాబ్‌కు పోకుండా గ్రూప్-2కు ప్రిపేర్ అవుతూ వచ్చాడు. తాజాగా గ్రూప్-2 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ముచ్చటగా మూడు ఉద్యోగాలు సాధించిన సాయింరాం గౌడ్‌ను తల్లి తండ్రులు, గ్రామస్తులు, తోటి మిత్రులు, పలువురు సాయిరాం గౌడ్‌ను అభినందించారు.
రెబ్బెన, మార్చి 11: గ్రూప్-2 ఫలితాల్లో కౌటల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన కామ్రే భాస్కర్ రాష్ట్ర స్థాయిలో 381.065 మార్కులతో 229 ర్యాంక్ సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భాస్కర్ 2016లో సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియా స్టోర్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గోలేటిటౌన్‌షిప్‌లోని గ్రంథాలయంలో చదువుకొని ప్రస్తుతం గ్రూప్-2 ఉద్యోగం సాధించాడు.