మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 12 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కాస్త గందరగోళ పరిస్థితుల్లో పోలింగ్ ముగిసినప్పటికీ.. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. దీంతో కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎవరికీ వారు అంచనాల్లో మునిగి తేలుతూ గెలుస్తామా? లేదా? అన్న లెక్కలు వేసుకుంటున్నారు. పోలైన ఓ ట్లు.. అందులో మనకు వచ్చే ఓట్లు ఎన్నంటూ బేరీజు వేసుకుంటూ.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు పరిశీలిస్తున్నారు. పోటీ చేసిన డివిజన్, వార్డు ల్లో పరిస్థితి ఏంటంటూ ఆరా తీస్తున్నారు. మ రోవైపు రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయా లు మొదలెట్టెశాయి.
మంచిర్యాల, చెన్నూర్, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీకు సం బంధించి కొన్ని రాజకీయపార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఓ పార్టీ తన అభ్యర్థులకు మహారాష్ట్రకు తీసుకెళ్లగా, మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో ఓ పార్టీ క్యాంపు పెట్టారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి నాయకులు కరీంనగర్, హైదరాబాద్ ఇలా ఇతర ప్రాంతాలకు క్యాంపులకు వెళ్లినట్లు తెలిసింది. ఫలితాలు తమకు అనుకూలంగా ఉ న్నా, ప్రతికూలంగా ఉన్న ఎదుర్కొనేందుకు, అభ్యర్థులకు కాపాడుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. 16న కార్పొరేషన్ మేయ ర్, మున్సిపాలిటీలకు చైర్మన్లు ప్రమాణస్వీకా రం చేయనున్న నేపథ్యంలో.. పదవులు ఎవరి ని వరిస్తాయోనన్న అంచనాలు మొదలయ్యా యి. నేటి ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది.
ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పకడ్బం దీ ఏర్పాట్లు చేశారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో కౌంటింగ్ అసిస్టెంట్లు, హెల్పర్స్, ఆర్వోలు, నోడల్ ఆధికారులను నియమించారు. మధ్యా హ్నం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల సమీపం లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును భద్రతా సిబ్బందికి చూపించిన వారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, లైటర్లు లాంటి వస్తువులు కేంద్రంలోకి తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. అధికారు లు, పోలీసులు, ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి టీటీడీసీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 49 వార్డులకు సంబంధించి 49 టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్‌కు ఇద్దరు చొప్పున కౌంటింగ్ అసిస్టెంట్లు, నలుగురు కౌంటింగ్ నోడల్ ఆఫీసర్లు, 11 మంది ఆర్వోలు, 11 మంది ఏఆర్వోలను నియమించారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆసిఫాబాద్ బల్దియా ఎన్నికల ఓట్ల లెకింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక హాల్లో ఐదు టేబుల్స్ చొప్పున రెండు హాల్లలో 10 టేబుల్స్ ఏర్పాటు చేసి 20 వార్డులను రెండు రౌండ్లలో ఓట్ల లెకింపు చేయనున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 60 డివిజన్లకు 60 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 132 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 66 మంది సూపర్వైజర్లు, రెండు టేబుళ్లకు ఒకరు చొప్పున 30 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఆర్వో) లు కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారు.
చెన్నూర్ మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఓట్ల లెక్కంపు చేయనున్నారు. మొత్తం 18 వార్డులకు తొమ్మిది రూమ్‌లలో ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. తొలి రౌండ్లో తొమ్మిది వార్డుల ఫలితాలు లెక్కిస్తారు. ఆ ఫలితాలు వెల్లడించాక రెండో రౌండ్లో మరో తొమ్మిది వార్డుల ఓట్లు లెక్కించనున్నారు. 10 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 20 మంది కౌంటింగ్ సహాయకులను నియమించారు.
లక్షెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 వార్డులకు 8 టేబుల్స్ ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు. అదనపు సిబ్బందితో కలిపి 9 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులను కేటాయించారు.
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రాన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని డీఏవీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. 30 వార్డులకు రెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ సహాయకులు విధులు నిర్వహిస్తారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తులో ఎడమ వైపు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల కౌంటింగ్‌కు 22 టేబుల్స్, బ్యాలెట్ బాక్సులకు ఒక టేబుల్ మొత్తం 23 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు 23 మంది, అదనంగా మరో ఐదుగురు మొత్తం 28, కౌంటింగ్ అసిస్టెంట్లు 46 మంది, అదనంగా తొమ్మిది మంది మొత్తం 55 మంది ఉండగా నిర్మల్‌లకు 83 మంది విధులు నిర్వహిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో గల మొదటి అంతస్తు కుడివైపు భైంసా మున్సిపల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. భైంసా మున్సిపాలిటీలో 26 వార్డుల కౌంటింగ్‌కు 13 టేబుల్స్, బ్యాలెట్ బాక్సులకు ఒక టేబుల్ మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సూపర్ వైజర్లు 14 మంది, అదనంగా ముగ్గురు మొత్తం 17 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 28 మంది, అదనంగా ఆరుగురు మొత్తం 34 మంది మొత్తం 51 మంది విధులు నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో గ్రౌండ్ ఫ్లోర్లో ఖానాపూర్ మున్సిపల్ కౌంటింగ్ చేపట్టనున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలోని 12 వార్డుల కౌంటింగ్‌కు ఆరు టేబుల్స్, బ్యాలెట్ బాక్సులకు ఒక టేబుల్ మొత్తం ఏడు టేబుల్స్ ఏర్పాటు చేశారు. సూపర్ వైజర్లు ఏడుగురు, అదనంగా ఒక్కరు మొత్తం ఎనిమిది మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 14 మంది, అదనంగా ముగ్గురు మొత్తం 17 మంది, మొత్తం 25 మంది విధులు నిర్వహిస్తున్నారు.

బెల్లంపల్లిలోని జిల్లా పరిషత్ బజార్ ఏరియా ఉన్నత పాఠశాలలో..
బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి బజార్ ఏరియాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మొత్తం 34 వార్డులకు సంబంధించి 17 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. రెండు రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు. అదనపు సిబ్బందితో కలిపి 19 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 37 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు లెక్కింపులో పాల్గొననున్నారు.

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసీవోఏ క్లబ్లో ఏర్పాట్లు
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఆర్కే సీవోఏ క్లబ్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. 22 వార్డులకు 22 టేబుళ్లు పెట్టి కౌంటింగ్ నిర్వహించనున్నారు. 12 మంది రిటర్నింగ్ అధికారులు, 24 మంది సూపర్వైజర్లు, 44 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 24 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఫలితాలు మధ్యాహ్నంలోపు వెలువడే అవకాశాలున్నాయి.

ఆదిలాబాద్‌లోని టీటీడీసీలోని కేంద్రంలో లెక్కంపునకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో బాక్స్‌లను పరిశీలిస్తున్న తహసీల్దార్, టీపీవో

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో సిద్ధం చేసిన టేబుళ్లు