మంచిర్యాల, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 4న నిర్వహించనున్నారు. క్యాతన్పల్లితోపాటు కోరం లేక వాయిదా పడిన ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను సైతం అదే రోజు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలకు పరిశీలకులను (ఇన్చార్జిలు) నియమించింది.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రి జోగురామన్నతోపాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను పార్టీ నియమించినట్లు తెలిసింది.