ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎసార్ట్ సౌకర్యం తొలగించినట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యేల పర్యటనల సందర్భంగా కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎసార్ట్ ఇచ్చేవారు. పైలెట్‌గా వెళ్లే పోలీసు వాహనం హారన్ ఇస్తూ ముందుకెళ్లేది. దాని వెనకాల ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్లేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ఎసార్టు ఇవ్వడం లేదు. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే మంత్రులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఎసార్ట్ ఇస్తున్నారు. అదీ కూడా సీఎంవో నుంచి వచ్చే రేడియో మెసేజ్ ఆధారంగా ఎసార్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎసార్ట్ ఇవ్వకపోవడంతో వారు కొంత అసహనానికి గురువుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఈ విధానం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసిఫాబాద్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కోవలక్ష్మి, సిర్పూర్లో బీజేపీగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకపోవడంతోనే ఎస్కార్ట్ తొలగించినట్లు చర్చ సాగుతోంది. జిల్లాలో ఎక్కవగా అటవీప్రాంతం ఉంది. అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ఘటన జరిగితే ఎవ్వరిది బాధ్యతనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. హంగూ.. ఆర్భాటాలు లేకుండా ప్రజల్లో తిరగాలన్న ఉద్దేశంతో ఎస్కార్ట్ తొలగించినట్లు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి ఆ పార్టీ నాయకులు ప్రొటో కాల్ పాటించకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా స్పందించకపోవడం గమనార్హ ం.