కాగజ్‌నగర్, నవంబర్ 8 : కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు చెందిన సుమారు రూ. 5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం(ఆప్టోమెట్రిస్ట్) జాడ లేకుండా పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న కంటి పరీక్ష వైద్య నిపుణుడు కరీంనగర్‌లోని తన సొంత క్లినిక్‌లో వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సుమారు మూడు నెలల క్రితం యంత్రాన్ని తన సొంత కారులో తీసుకెళ్తుండగా, అక్కడే ఉన్న ఒక అధికారి ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నించగా, కౌటాల దవాఖానకు అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యంత్రం ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఈ విషయమై డీఎంహెచ్‌వో సీతారాంను ఫోన్లో సంప్రదించగా, యంత్రం రిపేర్‌లో ఉందని తెలిపారు. కంటి పరీక్ష వైద్య నిపుణుడు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, తెలుసుకుంటానని ఫోన్ పెట్టేశారు. అలాగే ఈ విషయమై యూడీసీ రవికిరణ్‌కు సంప్రదించగా తనకేమీ సమాచారం లేదని, యంత్రం తరలించేటప్పుడు లిఖితపూర్వకంగా ఎలాంటి పత్రం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ దవాఖానకు చెందిన సుమారు రూ.5 లక్షల విలువ చేసే కంటి పరీక్ష యంత్రం ఎవరికీ చెప్పకుండా తరలించుకుపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల క్రితం ఇక్కడ విధులు నిర్వహించిన ఓ కంటి పరీక్ష వైద్య నిపుణుడు నిర్మల్‌కు బదిలీపై వెళ్లారు. ఆ సమయంలో కరీంనగర్లో విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ సక్రమంగా సేవలు అందడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కంటి పరీక్ష యంత్రం తిరిగి దవాఖానకు తీసుకొచ్చి పరీక్షలకు వచ్చే వారికి సేవలందించాలని వారు కోరుతున్నారు.