కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాజీవ్ యువ వికాసంతో ఉపాధి కల్పిస్తామంటూ ఊరించిన కాంగ్రెస్ సర్కారు, చివరకు ఆ పథకం అమలు చేయకపోవడంతో యువతలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై రగిలిపోతున్న వారంతా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడం కష్టమేననిపిస్తున్నది. హడావుడిగా కమిటీలు వేసి.. దరఖాస్తులు స్వీకరించి.. యూనిట్లు సైతం మంజూరు చేసి, చివరకు ఆశలపై నీళ్లు చల్లగా, తమ ఓటుతో నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నది.
నిరుద్యోగ యువతీ యువకులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటం చేసింది. ఉద్యోగాల మాటెలా ఉన్నా కనీసం స్వయం ఉపాధితోనైనా స్థిరపడాలనుకొని ఆశ పడిన వారంతా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 30,022 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. 81 రకాల యూనిట్లు అమలు చేస్తామన్న ప్రభుత్వం జిల్లాకు 8,879 యూనిట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. యూనిట్ రకాన్ని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా రుణాలు ఇస్తామని చెప్పుకొచ్చింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి 100 శాతం రాయితీతో అందిస్తామని తెలిపింది. అంతలోనే మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. దీంతో రేవంత్ ప్రభుత్వంపై యువత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నది. దీని ప్రభావం స్థానిక ఎన్నికలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యువతీయువకులను ఎవరిని కదిలించినా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో యువత ఓట్ల శాతమే అధికంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే 3,53,895 ఓటర్లలో సుమారు లక్షా50 వేలకు పైగా యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం కనిపిస్తున్నది.