నిర్మల్, జూలై 7(నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్మల్ జిల్లాలో గందరగోళంగా కొసాగుతున్నది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ భారీ సర్వే ప్రారంభంలోనే బాలారిష్టాలు ఎదుర్కొంటున్నది. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. గతనెల 25న ప్రారంభమైన సర్ సర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణకు ఈనెల 24వ తేదీ చివరి గడువు కాగా, ఈనెల ఒకటవ తేదీ వరకే 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కావాలి.
ఇప్పటి వరకు 85 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో 70 శాతం మాత్రమే ఫారాలు ఓటర్లకు అందినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లకు 50 శాతానికి పైగాఎన్యూమరేషన్ ఫారాలు అందగా, పట్టణ ప్రాంతాల్లో 30 శాతం వరకే అందాయని చెబుతున్నారు. ముఖ్యంగా అద్దెకు ఉంటున్న ఓటర్లు 2002 జాబితా ప్రకారం అక్కడ లేకపోవడం, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియక బీఎల్వోలు ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, మరికొంత మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడం వంటి కారణాలతో పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే మందకొడిగా సాగుతున్నది. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుంటున్న ఓటర్లు వాటిని పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫారాల్లో అడిగిన కొన్ని కాలమ్స్‌లో 24 ఏళ్ల క్రితం నాటి పాత వివరాలు సేకరించడం ఓటర్లకు పెద్ద సవాలుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 ఏళ్ల క్రితం.. అంటే 2002 నాటి ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని మ్యాపింగ్ చేయాలని ఈసీ ఆదేశించడమే ఈ గందరగోళానికి కారణమవుతున్నది.
నాటి తమ ఓటరు సంఖ్య, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం వివరాలు తెలియక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చాలామంది ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. వీటికి తోడు క్షేత్రస్థాయిలో ఫారాలు ఎలా నింపాలో వివరించాల్సిన బీఎల్‌వోలకే ఈ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సమస్య జటిలంగా మారుతున్నది. కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు నేటికీ అందకపోవడంతో తమ ఓట్లు ఉంటాయో.. పోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 7,55,344 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలకు కనీసం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఓటర్లకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐఆర్పై విస్తృత ప్రచారం చేయకపోవడంతో అసలు ఇలాంటి సర్వే ఒకటి జరుగుతున్నదన్న విషయం కూడా చాలామంది ప్రజలకు తెలియడం లేదు. ఫారాలు అందని వారు, అందినా ఎలా పూర్తి చేయాలో తెలియని వారు.. ఎక్కడ తమ ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణకు ఈ నెల 24వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. గడువు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, జిల్లాలో సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఇదే వేగంతో సాగితే నిర్ణీత గడువులోగా లక్షలాది మంది ఓటర్ల వివరాల సేకరణ పూర్తి కావడం అసాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఓటర్లకు సరైన అవగాహన లేక ఇంటింటి సర్వే ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. సర్ ప్రక్రియపై అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఫారాలను నింపడంపై ఓటర్లకు అవగాహన లేక పదే పదే బీఎల్వోలను ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. తమ ఓటు ఉంటుందో, లేదోనన్న అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. 2002 ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే తమ పరిస్థితి ఏమిటని.. అప్పట్లో ఓటు హక్కు లేకుండా, ప్రస్తుతం ఓటరుగా ఉన్నవారు.. తమ కుటుంబ సభ్యుల వివరాలు లేకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం ఉన్నదనే ఆందోళన ఓటర్లలో వ్యక్తమవుతున్నది. ఎన్యూమరేషన్ ఫారాలు రెండు పూర్తి చేసేందుకు చదువుకున్న వారు ఒకటికి రెండు సార్లు ఇతరులను అడిగి ఫారాలు పూర్తి చేస్తున్నారు. ప్రతి విషయానికి బీఎల్వోలను అడిగే పరిస్థితి ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్ఐఆర్లో భాగంగా ప్రతీ ఓటరు రెండు ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్వోలకు ఇవ్వాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఒక్కో బీఎల్వోకు 1000 నుంచి 1,200 ఓటర్ల వరకు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలను ఇవ్వాల్సి ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. గ్రామాల్లో ఇతర సిబ్బంది సహకారం లభిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం బీఎల్వోలకు ఇబ్బందులు తప్పడం లేదు. అద్దె ఇళ్లల్లో ఉన్నవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అందుబాటులో లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయలేకపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల బీఎల్వోలు ఆయా కాలనీల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఆలయాల ప్రాంగణాల్లో అందుబాటులో ఉంటూ, ఓటర్లకు ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారు. ఇలా అనేక ఆటంకాల నడుమ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఆలస్యమవుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బీఎల్వోలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రజలకు ఫారాల భర్తీపై అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే జిల్లాలోని ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.