తాంసి, ఏప్రిల్ 20 : మత్తడి వాగు ప్రాజెక్టు పరిధి కుడి, ఎడమ కాలువల పరిధిలో జొన్న, మక, కూరగాయలు, వేరుశనగ పంటలు సాగవుతున్నాయి. కుడి కాలువ ఆయకట్టు 1200 ఎకరాలు, ఎడమ కాలువ ఆయకట్టు 8,500 ఎకరాలు ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కుడి కాలువను రూ.7.34 కోట్లతో తొమ్మిది కిలోమీటర్ల మేర పైప్లైన్ వేశారు. ఈ కాలువ ద్వారా తాంసి మండలంలోని హస్నాపూర్, వడ్డాడి, తలమడుగు మండలంలోని ఖడద్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర గ్రామాల్లో దాదాపు 320 మంది రైతులు 1200 ఎకరాలు సాగు చేస్తున్నారు.
దాదాపు 99 శాతం పనులు పూర్తయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా నీరు అందించడం లేదు. ఎడమ కాలువ ద్వారా అరకొరగా నీరు అందుతున్నా.. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఫలితంగా పంటలు వట్టి పోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, కాలువల ద్వారా నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. మత్తడి ప్రాజెక్టు కుడి కాలువను వచ్చే ఏడాదైనా ప్రారంభించాలని, లేకపోతే ఉద్యమం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణం పూర్తయినా కాలువ ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని రైతులు మండిపడుతున్నారు.
అసలు బోరులో నీళ్లు లేవు. నీటి కొరత వల్లే మా పంట పూర్తిగా ఎండింది. నేను హస్నాపూర్ శివారులో ఐదెకరాల్లో వేసిన జొన్న పంటలో మూడెకరాలు పూర్తిగా ఎండింది. రూ.30 వేల పెట్టుబడి పెట్టినా ఏం లాభం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. రైతులకు ఆర్థిక సాయాన్ని అందించి, భవిష్యత్లో నీటి వనరుల కోసం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పంట నష్టం నివారణకు తక్షణ సహాయం అందించాలి.
– పాలకొండ గోవర్ధన్, రైతు, హస్నాపూర్.
నేను హస్నాపూర్ శివారులో నాలుగు ఎకరాల్లో జొన్న వేశా. మత్తడి ప్రాజెక్టు కుడి కాలువ ప్రారంభం కాకపోవడంతో సాగు నీరు అందడం లేదు. రెండు ఎకరాల్లో పంట పూర్తిగా ఎండింది. మత్తడి కుడి కాలువతో నీళ్లు వస్తాయన్న ఆశతో జొన్న విత్తనాలు వేశాం. కానీ.. కుడి కాలువ నీరు ఇవ్వలేదు. పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాలేదు. మిగిలిన పంట ఎండిపోకుండా చూసుకుంటున్నాం. కాలువ ప్రారంభమై ఉంటే పంట చేతికొచ్చేది.
– దర్శనాల రవి కిరణ్, రైతు, హస్నాపూర్.