ఆదిలాబాద్, మే 24(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి అధ్వానంగా మారింది. పల్లె ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం, వంతెనల పనులు కొనసాగుతున్నాయి. వందల కోట్లతో చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి ప్రభుత్వం రోడ్లను నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చింది. ప్రస్తుతం ఆ రహదారుల నిర్వహణను గాలికొదిలేశారు. ఫలితంగా రహదారులు రోజు, రోజుకు పాడవుతున్నాయి. పలు గ్రామాల ప్రజలు రహదారులపై ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చిత్తడిగా మారాయి. చిన్నపాటి వర్షాలకే రహదారుల పరిస్థితి అధ్వానంగా మారితే వర్షకాలంలో మరిన్ని ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.
పది రోజుల్లో వర్షాకాలం ప్రారంభంకానుండడంతో గ్రా మీణ ప్రాంతాల ప్రజలు రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకున్నది. వర్షకాలంలో రైతులు వ్య వపాయం పనుల కోసం రోజు మండల కేంద్రాలకు వెళ్లా ల్సి ఉంటుంది. తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను కొనుగోలు, ఇతర పనుల కోసం మండల, జిల్లా కేంద్రాలకు వస్తారు. విద్యార్థులు రోజు పాఠశాల, కళాశాలలకు బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తారు. ఆయా గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలు, రేషన్ సరుకులు పలు పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తారు. రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు తప్పెటట్లు లేవు. నిర్వహణ ఖర్చులు రాక రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదని, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కారణంగా పనులు జరగలేదని అధికారులు అంటున్నారు.
బేల మండల కేంద్రం నుంచి పలు గ్రామాల ప్రజలు వర్షకాలంలో సాఫీగా రాకపోకలు సాగించడానికి బేల, మణియర్పూర్ మధ్యలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వంతెన ఇది. రూ.7.20 కోట్లతో నిర్మించి ఈ వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలోపు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. పిల్లర్ల వరకు పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే ఆపివేశాడు.
పనులు నిలిచి ఐదె నెలలు కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల అంటున్నారు. మరో పది రోజుల్లో వర్షాకాలం ప్రారంభకానుండడంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. వంతెన నిర్మాణంలో భాగంగా రోడ్డును తవ్వి కింది నుంచి ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం వస్తే మండలంలోని బెదోడ, గూడ, కాంగార్పూర్, మణియర్పూర్, దహేగాం, సాంగిడి గ్రామాలు రాకపోకలు నిలిచిపోతాయి. అధికారులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఉన్న రోడ్డును తవ్వేసి ఇప్పుడు దారిలేకుండా చేశారని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.