ఆదిలాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు అధికారు లు చర్యల ఫలితంగా ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది. జి ల్లాలో ఎన్నో సంవత్సరాలుగా గిరిజనులతోపాటు గిరిజనేతరులు అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నా రు.
పోడు రైతులు సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభు త్వం రెండేండ్ల కిందట పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఫారెస్ట్ కమిటీలను ఏర్పాటు చేసి అర్హులైన గిరిజన పోడు రైతులను గుర్తించింది. ఆదిలాబాద్ జిల్లాలో 12,222 మంది రైతులకు 31,683 ఎకరాల భూములకు సంబంధించిన హక్కు పత్రాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూములకు రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.10 వేల పంట పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసింది. గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూముల పరిష్కారానికి చర్యలు చేపట్టగా ఎన్నికల కోడ్ రావడంతో ఈ సమస్య పెండింగ్లో ఉంది.
పొడు భూముల్లో మొక్కల పెంపకం
అటవీ శాఖ భూముల్లో అధికారులు మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీశాఖ సిబ్బందిని భూములు సాగు చేస్తున్న రైతులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడకు చెందిన రైతులు తమను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాము సాగు చేస్తున్న భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటకుండా చూడాలంటూ ఆయా గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యేల వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్న భూములను తీసుకుంటే తమ ఉపాధి లేకుండా పోతుందని రైతులు అంటున్నారు.