ఇంద్రవెల్లి, మే 10 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాం ఆదివాసీ గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేశాయి. ఇండ్ల నిర్మాణాలు రూప్ లేవల్ వరకు పూర్తయి నెలలు గడుస్తున్నా బిల్లులు మంజురు కాలేదని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గట్టేపల్లి కొలాంగూడ, హర్కాపూర్ కొలాంగూడ, పాటగూడ, బోడ్డిగూడ, కేస్లాగూడ(ఎం), లిమ్గూడ, కోబ్బయిగూడ, ధనోరా(బీ), మర్కాగూడ కొలాం ఆదివాసీ గిరిజనులకు పీఎం జమన్, ప్రధానమంత్రి జన్‌జాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంతోపాటు ఇందిరమ్మ పథకంతో కలిపి 1053 కుటుంబాలకు ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 997 లబ్ధిదారులకు చెందిన ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇంకా 40 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అన్ని గ్రామాల్లో కూడా సొంత డబ్బులు పెట్టుకొని నిర్మాణాలు చేశారు. బేస్మిట్, పిల్లర్లు, రూప్ లెవల్ వరకు పూర్తి చేసిన వారికి కూడా రూపాయి బిల్లు రాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పట్టికైన అధికారులు, కలెక్టర్, ఐటీడీఏ పీవో కొలాం ఆదివాసులపై దృష్టి సారించి, బిల్లులు మంజురు చేసే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. బిల్లు మంజూరు విషయమై ఇంద్రవెల్లి ఎంపీడీవో జీవన్‌రెడ్డిని అడుగగా.. ఆధార్, జాబ్ కార్డులో తప్పులు ఉండడంతో బిల్లు మంజురు కావడం లేదని, త్వరలోనే మంజురు అవుతాయని తెలిపారు.

Adilabad1
ఒక్క రూపాయి రాలే..
బిల్లు వస్తుందని ఆశతో ఇంటి నిర్మాణం రూప్ లెవల్ వరకు పూర్తి చేశా. అప్పులు చేసి పనులు మొదలు పెట్టిన. నెలలు గడ్చిన అధికారులు బిల్లులు మంజురు చేయడం లేదు. వస్తున్నారు ఫొటోలు తీసుకుంటున్నారు వెళ్లిపోతున్నారు. అధికారులు కొలాం ఆదివాసులపై దృష్టి సారించి ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు మంజురు చేయించాలి. సమస్యలను పరిష్కరించి వెంటనే బిల్లు మంజురు చేయాలి.
– ఆత్రం ముత్తిబాయి, బొడ్డిగూడ, ఇంద్రవెల్లి మండలం.
పిల్లర్లు పూర్తయిన బిల్లులు రాలేదు..
నా భార్య కుమ్ర తుల్సిబాయి పేరిట ఇల్లు మంజురైంది. సొంత డబ్బులు పెట్టి పిల్లర్ల వరకు నిర్మాణం చేయగా.. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదు. పలుమార్లు అధికారులను అడిగిన చిన్న చిన్న లోపాల వల్ల బిల్లు రావడం లేదని చెబుతున్నారు. మా గ్రామంలో 28 మందికి ఇండ్లు మంజురు అయితే ఎనిమిది మందికి బిల్లులు వచ్చాయి. బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నాం.
– కుమ్ర కోండురావ్, బొడ్డిగూడ, ఇంద్రవెల్లి మండలం.
అధికారుల చుట్టూ తిరుగుతున్నా..
పిల్లర్ల వరకు ఇంటి నిర్మాణం పూర్తయింది. బిల్లులు రావాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. నెలలు గడిచిన అధికారులు బిల్లులు మంజురు చేయడం లేదు. మంజురు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. గ్రామంలో ఒక్కరిద్దరికి మాత్రమే మంజురు చేశారు. దీంతో కొలాం ఆదివాసులు చాలా మంది అప్పులు చేస్తున్నారు. జిల్లా అధికారులు దృష్టి సారించి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నాం.
– చాహకటి రాజు, కేస్లాగూడ(ఎం), ఇంద్రవెల్లి మండలం.