రామంతాపూర్/వెంగళరావునగర్, ఆగస్టు 4 : ప్రజలకు సేవ చేస్తున్నాం.. తమ సేవను గుర్తించి తగిన స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్స్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 15 రోజుల క్రితమే సమ్మె నోటీసు గడువు పూర్తయినప్పటికీ స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇందులో భాగంగా రామంతాపూర్ హోమియోపతి దవాఖానలోని ఆయుష్ సిబ్బందితోపాటు హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో తొలిరోజు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసనలు తెలిపినట్టు వెల్లడించారు. జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల అండ్ దవాఖాన రామంతాపూర్తోపాటు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన, నేచర్ క్యూర్ దవాఖాన బల్కంపేట, ప్రభుత్వ నిజామియా టీబీ యునానీ కళాశాల అండ్ దవాఖాన చార్మినార్ పరిధిలో సమ్మె నిర్వహించినట్టు చెప్పారు.
గత పదేండ్లుగా ైస్టెపెండ్ పెంపు సమస్యపై ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్లు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా తమ సమస్యను పట్టించుకోలేదని వాపోయారు. జీవన వ్యయం, వసతి, ఆహారం, ప్రయాణ, విద్యా సంబంధిత ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ైస్టెపెండ్తో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యపై చర్చలు జరిపి ైస్టెపెండ్ పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఎర్రగడ్డలోని బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల యూజీ, పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు దాదాపు 300 మంది కళాశాల ముందు బైఠాయించారు. ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బీ రాజేశ్ కల్యాణ్, ఉపాధ్యక్షురాలు హారికశ్రీ, జనరల్ సెక్రటరీ హబీబ్ హబాస్, శ్రవణ్‌రెడ్డి, అఖిల్‌కుమార్, రాకేశ్, సాహితీ, ప్రణయ్, వాసుదేవ్, బలీఘ్ ఉద్దీన్, నవనీత్‌కుమార్, రోహిత్, సుప్రియ, స్రవంతి, భార్గవ్, వాసు, మసీహ, సాయిదేవ్, విఘ్నేశ్, ఉమేశ్, బిందు తదితరులు పాల్గొన్నారు.