నిర్మల్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో జనగణన ప్రారంభమైంది. చివరిసారి 2011లో జనాభాను లెక్కించారు. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేసి జనాభాను తీయనున్నారు. జిల్లాలో ఇప్పటికే కలెక్టరేట్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ గణనను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో తప్పులు ఉండకూడదని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. జిల్లాలవారీగా గణాంకాలు తేలనున్నాయి.
మొదటి దశలో ఇళ్లు
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన దోహదపడుతుంది. పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన నిర్వహిస్తుండగా, చివరి సారిగా 2011లో చేపట్టింది. 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేయనున్నారు. గణన రెండు దశల్లో జరగనున్నది. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహాలను లెక్కించనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నెల నుంచి జనాభా లెక్కింపు ప్రారంభించనున్నారు.
ఈసారి జనాభా గణనను దేశంలో మొదటి సారిగా డిజిటల్ విధానంలో అంటే మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టర్లను ఉపయోగించి లెక్కించనున్నారు. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి 15 రోజుల ముందు నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న అంశాలపై అధికారులకు పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. త్వరలోనే బ్లాక్‌లవారీగా ఎంపిక చేసిన ఎన్యుమరేటర్ల ద్వారా ముందుగా ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు.