ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తి విక్రయాల్లో దళారుల దందా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులుగా దళారులు మాయాజాలం ప్రదర్శిస్తూ అమాయక రైతుల పేరిట వందల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గ్రా మాలు, మండల కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి పం టను తక్కువ ధరకు కొని మద్దతు ధరతో సీసీఐకి వి క్రయిస్తున్నారు. జిల్లాలోని నార్నూర్, ఇంద్రవెల్లి, ఇ చ్చోడతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, జైనూర్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల కు చెందిన దళారులు అక్రమ దందాకు పాల్పడుతున్నారు.
రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు క్వింటాలు కు రూ.6500 వరకు కొనుగోలు చేసి సీసీఐకి క్వింటాలుకు రూ.7421 చొప్పున విక్రయిస్తున్నారు. దళారు లు భారీ వాహనాల్లో వంద క్వింటాళ్ల వరకు పత్తిని తీసుకువస్తుండడంతో అధికారులు కొనుగోలు చేయ డం లేదు. వ్యాన్లు, ట్రాక్టర్లో పత్తిని తీసుకువస్తేనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో దళారులు ఐచర్ వా హనాల్లో కాకుండా మినీ వాహనాల్లో పంటను తీసుకువస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో పంట విక్రయాల్లో తేమ, పత్తి నాణ్యత విషయంలో ధర తగ్గిస్తున్న సీసీఐ అధికారులు దళారులు విక్రయించే పంట విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు.
జిల్లాలో పది రోజుల నుంచి సర్వర్ సమస్య కారణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తక్కువ ధరకు పంటను ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ.6920కి విక్రయించి నష్టపోయారు. పది రోజుల తర్వాత శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మిగతా మార్కెట్ యార్డుల్లో ఎక్కడా పత్తి కొనుగోళ్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికే తీసుకువస్తున్నారు. దళారులు వాహనాల్లో ఎక్కువ మొత్తంలో పంటను మార్కెట్‌యార్డుకు తీసుకువస్తుండడంతో రైతులు పంట విక్రయానికి ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తి విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ మార్కెట్‌యార్డు కార్యదర్శి మధుకర్‌ను ఇటీవల సస్పెండ్ చేశారు. దళారులు తీసుకువచ్చిన పత్తికి సీసీఐకి విక్రయించేందుకు వీలుగా టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేశారనే ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పత్తి కొనుగోళ్లలో దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
జిల్లాలో సీసీఐ పత్తి విక్రయాల్లో దళారుల దందాను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్న దళారులు, మద్దతు ధరకు సీసీఐకి పంటను విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయక రైతులను డబ్బులు ఆశగా చూపి వారి పట్టా పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డులు తీసుకుని పంటను వారి పేరిట పంటను విక్రయిస్తున్నారు. పంట కొనుగోళ్లలో రైతుల వివరాలను పూర్తిగా పరిశీలించాలి.
– భోజన్న, రైతు, స్వరాజ్య వేదిక, జిల్లా అధ్యక్షుడు