Indravelli | ఇంద్రవెల్లి : బౌద్ధ అనుయాయులపై మతోన్మాద శక్తుల జరిపిన తీవ్రంగా ఖండిస్తున్నామని, బుద్ధుని విగ్రహాన్ని తొలిగించడం సరైంది కాదని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కార్యదర్శి వాగ్మారే కాంరాజ్ అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాళ్ల బోరిగాం గ్రామంలో బుద్ద జయంతి రోజు కొందరు మతోన్మాదులు బౌద్ధ అనుయాయులపై దాడి చేయడం యావత్ సమాజానికి సిగ్గు చేటని అన్నారు.
ప్రపంచానికి శాంతి, అహింస, కరుణ, మైత్రి పంచిన తథాగత సిద్ధార్థ గౌతమ బుద్ధుడు విగ్రహాన్ని అధికారులు తొలగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బుద్ధుడు విగ్రహాన్ని తొలిగించిన చోటే మళ్ళీ ప్రతిష్టించాలని, ఆర్డిఓపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బౌద్ధులపై దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ సందీప్, జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా కార్యదర్శి సోన్ కాంబ్లే బాబాసాహెబ్, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకుడు కాంబ్లే అతీష్ కుమార్,అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ఉపాధ్యక్షుడు పవార్ శివాజీ, భీం ఆర్మీ మండల అధ్యక్షుడు సూర్యవంశీ ఉత్తం, దళిత సంఘాల నాయకులు సూర్యవంశీ గణేష్, గాయక్వాడ్ రాందాస్, సోన్ కాంబ్లే నవీన్ తదితరులు పాల్గొన్నారు.