ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మొదటి విడుతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణ తెచ్చి, లెక్కకు మించిన సంక్షేమ పథకాలతో అండగా నిలిచిన బీఆర్ఎస్కే గిరిజనం జై కొట్టింది. అధికారంలో లేకపోయినా అనేక గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్పైనున్న అభిమానాన్ని చాటుకున్నది. కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేకతను తెలియజేసి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పట్టం కట్టి.. ఆదివాసీ గడ్డ.. గులాబీ అడ్డా అని నిరూపించింది.
– మంచిర్యాల, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
‘బీఆర్ఎస్ సర్కారు.. మావ నాటే.. మావ రాజ్.. అన్న గిరిజనుల కలను సాకారం చేసింది. వందలాది గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అడవిబిడ్డలను అధికారానికి దగ్గర చేసింది. గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిని మారుమూల గ్రామాల దాహార్తిని ‘మిషన్ భగీరథ’తో తీర్చింది. మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేసింది. పల్లెలను ప్రగతి పథంలో నడిపించి నంబర్‌వన్‌గా నిలిపింది. పోడు భూములకు పట్టాలిచ్చి రైతు బంధు ద్వారా సాయమందించింది.’.. ఇలా గిరి పుత్రుల కోసం లెక్కకు మించి పథకాలు అమలు చేయగా, వారంతా ఈ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి జై కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొలి విడుత జరిగిన పోరులో అనేకచోట్ల పట్టం కట్టారు. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని అనేక గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని కారు జోరును అడ్డుకోలేరని నిరూపించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు ప్రచారం చేసిన గ్రామాల్లోనూ ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవలేకపోయారు. పైపెచ్చు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీసి తమ వ్యతిరేకతను తెలియజేశారు. గడిచిన వారం, పది రోజుల్లోనే దాదాపు నాలుగు గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యే బొజ్జును నిలదీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్న దానికి ఈ వీడియోలు నిదర్శనంగా నిలిచాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఉట్నూర్ పక్కనే ఉన్న లక్కారం పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.
ఇక మరో మేజర్ గ్రామపంచాయతీ ఇంద్రవెల్లిలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. పలు గిరిజన గ్రామాల్లోనూ హస్తం పార్టీ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలంలోనూ బీఆర్ఎస్.. అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. ఈ మండలంలో 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే, 9 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చే కడెం, ఖానాపూర్ , దస్తురాబాద్, పెంబి మండలాల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చారు. ఈ మండలాల్లో 19 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం, మేజర్ పంచాయతీలను దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దక్కించుకున్నది. లింగాపూర్, సిర్పూర్ యూ, జైనూర్, వాంకిడి, కెరిమెరి మండలాల్లో మొత్తం 109 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 40 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించారు. 33 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. 31 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే, 5 స్థానాలతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉండి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే నార్నూర్ మండలంలో 16 జీపీలను బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా, ఏడుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. గాదిగూడ మండంలో 14 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. ఆదివాసీలు, గిరిజనులు అధికంగా ఉండే ఈ మండలాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు కాంగ్రెస్, నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ఇద్దరు ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ స్పైష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా జనాల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీలో పల్లెపోరులో సత్తా చాటింది.
అధికార పార్టీకి గట్టిపోటీ ఇస్తూ తొలి విడుతలో 120 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నది. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వారిని కలుపుకుంటే అధికార పార్టీకి తీసిపోకుండా స్థానాలు వస్తున్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ సైనికులు, డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే రెండో విడుత ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కేందుకు సిద్ధం అవుతున్నారు.