నిర్మల్ అర్బన్, మే 3 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. సర్కారు స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకా లు అందించేందుకు చర్యలు తీసుకుంటు న్నది. ఇప్పటి ఆయా స్కూళ్లకు పుస్తకాలను చేర వేస్తు న్నది.జిల్లాలో మొత్తం 834 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 576 ప్రాథమిక పాఠశాలలు, 90 ప్రాథమికోన్నత పాఠశాలలు, 168 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 70 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
జిల్లాలకు చేరిన పాఠ్య పుస్తకాలు
రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలను నిర్మల్ జిల్లాకు ఆరు విడుతలుగా ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా జిల్లాలోని డిపో కేంద్రాలకు పంపిణీ చేశారు. జిల్లాలోని యూడైస్‌లో ఉన్న వివరాల ప్రకారం విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని సర్కారు స్కూళ్ల కోసం ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ముద్రించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను డిపోలకు తరలించింది. మార్చి 31న, ఏప్రిల్ 1న, 8న, 11, 12, 27తేదీల్లో జిల్లాకు వచ్చాయి.
పుస్తకాల వివరాలు..
జిల్లాలో మొత్తం 834 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 70 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మొత్తం 5,12, 901 పాఠ్యపుస్తకాల అవసరం ఉంది. గత సంవత్సరం విద్యార్థులకు పంపిణీ చేయగా 21,241 పుస్తకాలు మిగిలాయి. ప్రస్తుతం విద్యార్థులందరికీ 4,91,660 పుస్తకాలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాకు 1,48,600 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 3,43,060 పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి త్వరలోనే జిల్లాకు రానున్నాయి.
బార్‌కోడింగ్ ఆధారంగా పంపిణీ
కోట్లాది రూపాయల వెచ్చించి ముద్రించిన పాఠ్యపుస్తకాలు ప్రైవేట్‌పరం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. స్కాన్, బార్‌కోడింగ్ ఆధారంగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ముద్రించింది. పుస్తకాలపై ఉన్న బార్ కోడ్ ఆధారంగా అవి ఏ జిల్లాకు కేటాయించారో సులువుగా తెలుసుకోవచ్చు. ఇలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పక్కదారికి అడ్డుకుట్ట వేసింది.
ఒకే పుస్తకం.. రెండు భాషలు..
గతేడాది నుంచి సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చదువుల వైపు దృష్టి సారించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను తెలుగు-ఇంగ్లిష్ మీడియం (ఒకే పుస్తకంలో)లలో ముద్రించింది. దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువుల్లో ఎదురయ్యే ఇబ్బందులు ద దూరం చేసేందుకు చర్యలు తీసుకున్నది. రెండు భాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్కూళ్ల ప్రారంభం నాటికి పుస్తకాలు
రాష్ట్ర ప్రభుత్వం గతేడాదికంటే భిన్నం గా వేసవి సెలవులు ఇవ్వక ముందే ఆరు విడుతలుగా నిర్మల్ జిల్లాకు పాఠ్య పుస్తకాలు చేరాయి. త్వర లో పూర్తి స్థాయిలో జిల్లాకు పుస్తకాలు రానున్నాయి. పాఠశాలలు ప్రారంభం నాటికి వీటన్నింటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అందిస్తాం. పాఠశాలలు ప్రారంభమై పుస్తకాలు లేకుండా విద్యార్థుల చదువులు ఆగిపోకుండా ఉండేందుకు వేగంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం హర్షనీయం.
– డీఈవో రవీందర్ రెడ్డి, నిర్మల్